- యాదాద్రి జిల్లా మాదాపూర్ లో ఘటన
యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ లో గురువారం రాత్రి బీజేపీ ప్రచార రథంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీకి చెందిన కళాకారులు ప్రచార రథంపై ఊరూరూ తిరుగుతూ పాటలు పాడుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి మాదాపూర్ చేరుకున్న కళాకారుల ప్రచార రథంపై దుండగులు రాళ్లు విసిరారు. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకోకు దిగారు.
దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రాళ్లదాడిలో గాయపడిన కళాకారులను ఆలేరు బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల్లో వణుకు పుట్టుకుందని, అందుకే తమ ప్రచార రథంపై దాడికి పాల్పడ్డారన్నారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. వారు రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ నాయకులతో మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో బీజేపీ నాయకులు ధర్నా విరమించారు.