పామాయిల్ తోటకు నిప్పు పెట్టిన దుండగులు..కుట్ర కోణం దాగుందా..? 

ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి రెవెన్యూ పరిధిలోని పామాయిల్ తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించారు. దీంతో చాలా పామాయిల్ చెట్లు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని.. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే.. అప్పటికే నాలుగు ఎకరాల్లో పూర్తిగా పామాయిల్ చెట్లు దగ్ధమయ్యాయి. ఈ పామాయిల్ తోట బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డికి చెందినది. ఈ ఘటనపై మధిర టౌన్ పోలీస్ స్టేషన్ లో శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందా..? అనే కోణాల్లోనూ విచారిస్తున్నారు.