న్యూఢిల్లీ: బీమా సంస్థలకు యూనిఫైడ్ లైసెన్సును సులభతరం చేసేందుకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74శాతం నుంచి 100శాతానికి పెంచడం కోసం ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీమా చట్టాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ వర్గాలు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించాయి. బీమా సంస్థలకు యూనిఫైడ్ లైసెన్స్ ఇవ్వడం, ఎఫ్‌డీఐ పరిమితిని పెంచడం వల్ల దేశంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని, బీమా వ్యాప్తి మెరుగుపడుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.
పరిశోధనా సంస్థ స్విస్ రీ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం 2023లో బీమా రంగం కంట్రిబ్యూషన్జీడీపీలో 3.8శాతంగా ఉంది. యూనిఫైడ్ లైసెన్స్ వల్ల ఒకే సంస్థ జీవిత, సాధారణ, ఆరోగ్య బీమాను అందించవచ్చు. ప్రస్తుతం, జీవిత బీమా కంపెనీలు ఆరోగ్య బీమా వంటి ఉత్పత్తులను విక్రయించడం కుదరదు. సాధారణ బీమా సంస్థలు ఆరోగ్యబీమా సహా చాలా ప్రొడక్టులను అమ్మవచ్చు.
ఐఆర్‌డీఏఐ ఆలోచనే ఇది..
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) యూనిఫైడ్ లైసెన్స్ ప్రతిపాదనను మొదటగా గత ఏడాది తీసుకొచ్చింది. చట్టసభ సభ్యుల ప్యానెల్ ఫిబ్రవరిలో ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చింది. అయితే అర్హత ఉన్న సంస్థలకు తగిన మూలధనం ఉండాలని స్పష్టం చేసింది. బీమాలో 100శాతం ఎఫ్‌డీఐని అనుమతించాలని కూడా ప్రభుత్వం చూస్తోంది. దీంతో విదేశీ బీమా సంస్థలు సులభంగా ఇండియాలో వ్యాపారం చేయవచ్చు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో బీమా చట్టానికి సవరణలు తీసుకురావడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయమై వ్యాఖ్య కోసం చేసిన అభ్యర్థనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించలేదు. ఈ నెల ప్రారంభంలో ఐఆర్డీఏ చైర్‌పర్సన్ దేవాశిష్ పాండా మాట్లాడుతూ, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి దేశంలో బీమా వ్యాప్తిని పెంచడానికి భారతదేశం బీమారంగంలోకి 100శాతం ఎఫ్‌డీఐని అనుమతించాలని అన్నారు.