- పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మెరుగుదలకు నిర్ణయం
- మోడ్రన్ టెక్నాలజీపై చర్చించిన అధికారులు
- త్వరలోనే వివిధ ప్రభుత్వ శాఖలతోనూ భేటీ
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్లో రోజురోజుకు పెరిగే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఉమ్టా) స్టడీ చేస్తోంది. ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు తగినట్టుగా ట్రాఫిక్ నియంత్రణ చేస్తూనే, మరోవైపు ప్రజా రవాణా మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపైనా అధికారులు రిపోర్ట్ తయారు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్టా మరింత మెరుగైన పాత్ర నిర్వహిస్తుంది. హెచ్ఎండీఏలో ఒక భాగమైన ఉమ్టాలో ప్రధాన ప్రభుత్వ విభాగాలైన జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, ఆర్టీఏ, మెట్రోరైల్, వాటర్ బోర్డు, ఆర్అండ్ బీ తదితర విభాగాలు ఉండగా, వాటిని కో ఆర్డినేషన్ చేసేందుకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తీరుపైనా పరిశీలన చేస్తోంది. భవిష్యత్లో హెచ్ఎండీఏ పరిధిలో ప్రజారవాణా ఎలా ఉండాలి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై స్టడీ చేస్తోంది. ఆయా శాఖల కో ఆర్డినేషన్ తోనే పనులను నిర్వహించనుంది.
ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తగ్గించేందుకు..
ఇటీవల సిటీలో ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్ అధికారులతో వివిధ సమస్యలను చర్చించినట్టు ఉమ్టా అధికారులు తెలిపారు. ముఖ్యంగా వెహికల్ సంఖ్య సిటీలో రోజురోజుకు పెరిగిపోతుండగా.. ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రం అవుతున్నట్టు గుర్తించారు. రోజుకు 200 –300 కొత్త వెహికల్స్ రోడ్డుపైకి వస్తుండగా.. నెలకు ఆ సంఖ్య 9–10వేల మధ్య ఉంది. దీంతో ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడం లేదు. కొత్త టెక్నాలజీతో ట్రాఫిక్ సిగ్నలింగ్, ట్రాన్స్ పోర్టేషన్ అమలుపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు అధికారులు తెలిపారు.
కీలకమైన ఏరియాల్లో ట్రాఫిక్ ను నియంత్రించడానికి కొన్నిచోట్ల రోడ్ల విస్తరణ, మరికొన్ని ప్రాంతాల్లో మోడ్రన్ టెక్నాలజీతో సిగ్నలింగ్ సిస్టమ్ అవసరమని గుర్తించారు. ముఖ్యంగా పార్కింగ్ పాలసీలో భాగంగా ప్రజలు ఎక్కువగా ప్రజా రవాణాను వినియోగించుకునేలా ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ వంటివి కూడా సమావేశంలో చర్చించారు. రోడ్ల విస్తరణ చేస్తే భారీగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను సేకరించాల్సి ఉంటుంది. అందుకు భారీగా వ్యయం అవుతుంది. ఇబ్బందులు కూడా వస్తాయి. అలాకాకుండా మెరుగైన ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను మరింత విస్తరించాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా ప్రజలు కూడా ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కూడా ఉమ్టా చేపట్టిన స్టడీలో పేర్కొంటున్నట్టు అధికారులు తెలిపారు.
త్వరలో ప్రభుత్వ శాఖలతో మీటింగ్
రెండేండ్లుగా ఉమ్టా భేటీ కాలేదు. దీంతో ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా రవాణా మెరుగుదలపై కొన్ని కీలక సూచనలు చేయనుంది. ఉమ్టా చైర్మన్ గా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, కన్వీనర్ గా ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిటీలో సభ్యులుగా సిటీలోని కీలక శాఖల ఉన్నతాధికారులు ఉంటారు. హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, పోలీస్, ఆర్టీఏ, ఆర్టీసీ, మెట్రోరైల్, ఆర్అండ్ బీ తదితర శాఖలు ఉమ్టాతో సమన్వయంగా పనిచేస్తాయి. సిటీలో ట్రాఫిక్, ప్రజా రవాణా వ్యవస్థ నిర్వహణ, ఇతర సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. కమిటీ సూచనల మేరకు ఆయా శాఖలు పనులు చేస్తాయి. ఇటీవలే ఉమ్టా పరిధిలోకి జీహెచ్ఎంసీతో పాటు మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి ప్రాంతాలను కలిపారు.