![యూపీఎస్ను నోటిఫై చేసినం.. సుప్రీం కోర్టుకు కేంద్రం వివరణ](https://static.v6velugu.com/uploads/2025/02/unified-pension-scheme-notified-may-address-concerns-of-judicial-officers-centre-tells-sc_tM4kafn1W7.jpg)
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్)ను ఇటీవలే నోటిఫై చేశామని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. జిల్లా న్యాయ అధికారులతో సహా ఉద్యోగులందరి సమస్యలను పరిష్కరిస్తుందని పేర్కొంది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై సుప్రీం కోర్టుకు ఈ విషయాన్ని తెలియజేశారు. జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టీన్‌తో కూడిన బెంచ్ ఈ వాదనలు విని తదుపరి విచారణను 12 వారాలకు వాయిదా వేసింది. యూపీఎస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు కొద్దిరోజులు వేచిచూడటమే మంచిదని కోర్టు అభిప్రాయపడింది.
కాగా, యూపీఎస్ ను ప్రవేశపెడ్తూ కేంద్ర ప్రభుత్వం జనవరి 25న గెజిట్ ఇచ్చింది. దీని ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ల రిటైర్మెంట్కు ముందు ఏడాదిపాటు వాళ్ల సగటు జీతంలో 50శాతాన్ని పెన్షన్‌గా చెల్లించాల్సి ఉంటుంది. యూపీఎస్ ఆప్షన్ ఎంచుకున్న ఎంప్లాయీస్‌కు మాత్రమే వచ్చే ఏప్రిల్ నుంచి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇందులో జిల్లా న్యాయవ్యవస్థలో పనిచేస్తున్న అధికారులు, రిటైర్డ్ హైకోర్టు జడ్జిలకు వచ్చే పెన్షన్ కొంతమేర తగ్గుతుందంటూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.