సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్లకు ఆగమాగం యూనిఫాంలు

సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్లకు ఆగమాగం యూనిఫాంలు
  • ఒక్కో జత కుట్టుకూలి రూ.50 మాత్రమే ఇచ్చిన సర్కారు

మెదక్​, శివ్వంపేట, వెలుగు:  అకడమిక్ ఇయర్ ప్రారంభమైన అయిదారు నెలలకు సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్లకు ఆగమాగం యూనిఫాంలు కుట్టించి ఇవ్వడంతో స్టూడెంట్లు వేసుకోలేకపోతున్నారు. సరైన కొలతలు తీసుకోకుండా కుట్టడంతో అంగీలు లూజ్​గా ఉండి జారిపోతుంటే..ప్యాంట్లు టైట్​గా ఉండి, వేసుకోగానే చినిగిపోతున్నాయి. జూన్12న స్కూళ్లు మొదలైతే ఆగస్టు నెల దాకా జిల్లాలకు బట్ట సప్లై చేయలేదు. కుట్టుకూలి కూడా తక్కువ కావడంతో చాలామంది టైలర్లు, మహిళా సంఘాలు ముందుకు రాలేదు. వచ్చినవాళ్లు కూడా సరైన కొలతలు తీసుకోకుండానే కుట్టడంతో పిల్లలు వేసుకోవడం లేదు. కొందరికి యూనిఫాం సైజు సరిపోయినప్పటికీ స్టిచ్చింగ్ సరిగ్గా చేయకపోవడంతో కుట్లు ఊడిపోతున్నాయి. దీంతో చాలా మంది యూనిఫాంలు పక్కనపెట్టి సివిల్​ డ్రెస్సులేసుకొనే స్కూళ్లకు పోతున్నారు.  

పాత బట్ట పంపించిన్రు..

రాష్ర్టంలో 26,072 సర్కారు బడులుండగా, ఇందులో దాదాపు 24 లక్షల మంది చదువుకుంటున్నారు. వీరికి రెండు జతల యూనిఫాం అందించడానికి కోటిన్నర మీటర్ల క్లాత్ ​అవసరమవుతుంది. ఏటా ఏప్రిల్​ మొదటి వారంలోనే జిల్లాలకు బట్ట సప్లై చేసి, స్టిచ్చింగ్​ టెండర్లు నిర్వహిస్తే జూన్12 కల్లా కుట్టి పిల్లలకు అందించే అవకాశం ఉండేది. కానీ క్లాత్​ సప్లై కోసం తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో)తో అగ్రిమెంట్ ​చేసుకోవడంలో సర్కారు ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా ఆలస్యం చేసింది. 2021–22 అకడమిక్ ​ఇయర్​లో కరోనా సాకుతో యూనిఫామ్స్ ​సప్లై చేయలేదు.  దీంతో ఆ ఏడాది సప్లై చేయకుండా ఉంచిన 62 లక్షల మీటర్ల పాత క్లాత్ ను సైతం ఈ ఏడాది జూలై 24 తర్వాతే జిల్లాలకు పంపించారు. మిగిలిన క్లాత్ కొన్ని​జిల్లాలకు చేరేసరికి సెప్టెంబర్ కాగా, మరికొన్ని జిల్లాలకు అక్టోబర్​లో చేరింది. 

కుట్టుకూలికి తగ్గట్టే క్వాలిటీ 

బయట ఒక్కో యూనిఫాం కుట్టేందుకు టైలర్లు రూ.300 నుంచి రూ.400 దాకా తీసుకుంటారు. కానీ సర్కారు మాత్రం ఒక్కో జత స్టిచ్చింగ్​కు కేవలం రూ.50 మాత్రమే చెల్లిస్తోంది. పైగా టైలరే స్కూల్​కు వెళ్లి స్టూడెంట్ల కొలతలు తీసుకోవాలి. ఈ ట్రావెల్​ చార్జీలు, ఇతర ఖర్చులను సైతం గవర్నమెంట్ ​ఇవ్వడం లేదు. దీంతో ఈసారి యూనిఫాంలను కుట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా టైలర్లు, మహిళా సంఘాలు ఆసక్తి చూపించలేదు. కొద్ది మందే డ్రెస్​లు కుట్టేందుకు ముందుకు రావడం, వాళ్లు కూడా స్కూళ్లకు రాకుండా ఇష్టం వచ్చినట్లు కుట్టి పంపడంతో సమస్య ఏర్పడింది. మరికొన్ని చోట్ల సెల్ఫ్​  హెల్ప్​ గ్రూప్​లే డ్రెస్సులు కుట్టాయి. టైలర్లు  స్టూడెంట్ల అందరివి కాకుండా క్లాస్​కు ఒక స్టూడెంట్ కొలతలు మాత్రమే తీసుకొని కుట్టడంతో పనికి రాకుండా పోయాయి. కొన్ని స్కూళ్లలో పిల్లలకు పంపిన యూనిఫాంలలో ఒక కాలు ప్యాంట్ కు థిక్​కలర్, మరొక కాలుకు​ డల్​కలర్ ​ఉండడంతో చూసినవాళ్లు నవ్వుతున్నారని స్టూడెంట్స్ తొడుక్కోవడం లేదు. దారం, గుండీలు, జిప్​లు క్వాలిటీవి వాడకపోవడంతో కుట్లు పెకిలిపోతున్నాయని, బటన్స్​, జిప్స్ ​ఊడిపోతున్నాయని అంటున్నారు. మెదక్​ జిల్లాలోని శివ్వంపేట మండల కేంద్రంలో ఉన్న జడ్పీ హైస్కూల్​ స్టూడెంట్స్​కు వారం కింద యునిఫాంలు పంపించగా, చాలా మంది సైజులు సరిపోక పక్కనపడేశారు. మెదక్ జంబికుంటలోని ప్రైమరీ స్కూల్​ స్టూడెంట్స్​కు దాదాపు నెలన్నర కింద యునిఫాంలు ఇచ్చినా షర్ట్​లు, నెక్కర్లు లూజ్​ కావడంతో సివిల్​డ్రెస్సుల్లోనే స్కూల్​కు వస్తున్నారు. ప్రతి క్లాసులో ఒకరి సైజు తీసుకుని యునిఫాంలు కుట్టించడం జరిగిందని, సైజులు ఎక్కువ, తక్కువ వస్తే వాటిని సరి చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 

ప్యాంట్ ​రెండు కలర్ల బట్టతో కుట్టిన్రు

నాకు మొన్ననే యునిఫాం ఇచ్చిన్రు. ప్యాంట్​చిన్నగైంది. నాకు వచ్చిన ప్యాంట్​రెండు కలర్ల బట్ట జాయింట్​ చేసి కుట్టిన్రు. వేసుకుంటే గలీజ్​గ కనిపిస్తుంది. గా ప్యాంట్​ వేసుకుని స్కూల్​కు ఎట్లా పోవాలే. బడి బంజేత్త గాని ఈ డ్రెస్సు అస్సలేసుకోను. ​

– సచిన్, 9వ తరగతి, 
జడ్పీహెచ్ఎస్, శివ్వంపేట

అందరూ నవ్వుతున్నరు 

వారం కింద నాకు యునిఫాం ఇచ్చిన్రు. షర్టు పెద్దగున్నది. ప్యాంటు చిన్నగున్నది. వేసుకుంటే కుట్లు ఊడిపోతున్నయ్. ఈ యునిఫాం వేసుకుని స్కూల్ కు పోతే అందరు నవ్వుతున్నారు. అందుకే అవి తొడుక్కుంటలేను. 

– సాయికిరణ్, 8వ తరగతి, 
శివ్వంపేట జడ్పీ హైస్కూల్