
మొన్న ‘ఓ సిటీ’.. నిన్న ‘మా సిటీ’.. నేడు ‘ఉని సిటీ’ పేరుతో వెంచర్లు
- ఉనికిచర్ల ఓఆర్‌ఆర్ పక్కన 135 ఎకరాల్లో టౌన్‌షిప్
- మొదటి దశలో 10 ఎకరాల్లో ప్లాట్ల డెవలప్‌మెంట్
- ఈ నెల 20న బహిరంగ వేలానికి ఏర్పాట్లు
వరంగల్, వెలుగు : కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్తోంది. సిటీకి దగ్గరగా ఉండే భూములను డెవలప్ చేసి వేలం వేస్తోంది. గతంలో ఓరుగల్లు (వరంగల్ అజాంజాహి మిల్ ఏరియా)లో ‘ఓ సిటీ’ పేరున, ఎనిమిది నెలల క్రితం హనుమకొండ సిటీకి దగ్గర్లోని మడిపల్లి వద్ద ‘మా సిటీ’ పేరున వెంచర్లు చేసిన కుడా తాజాగా ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉండే ఉనికిచర్ల వద్ద ‘ఉని సిటీ’ పేరుతో మూడో ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసింది.
ప్లాట్లతో మస్త్ పైసలు
గతంలో మర్రి యాదవరెడ్డి కుడా చైర్మన్‌గా ఉన్న టైంలో వరంగల్ అజాంజాహి మిల్ ఏరియాను ఆనుకుని 'ఓ సిటీ' పేరుతో టౌన్‌షిప్ డెవలప్ చేయడం ద్వారా వెంచర్ ప్లాన్ చేశారు. ప్రైమ్ లొకేషన్‌లో ఐదారేండ్ల కింద 117 ఎకరాల్లో 835 ప్లాట్లు డెవలప్ చేశారు. అప్పుడు గజం ధర రూ.15 వేలు పలకగా, రెండు వారాల కింద వేసిన మరో వేలంలో గజం ధర రూ. లక్ష పలికింది. హన్మకొండ నుంచి మడిపల్లి మార్గంలో 2018 – 19లో కుడా పెద్దలు ‘మా సిటీ’ వెంచర్‌కు ప్లాన్ చేశారు. 300 ఎకరాల్లో డెవలప్ చేసిన టౌన్‌షిప్‌లో 2 వేల ప్లాట్లు ఉండనున్నట్లు తెలిపారు. మొదటి దఫా 80 ప్లాట్ల వేలం వేయగా గజం ధర రూ.3 వేలుగా నిర్ణయించారు. వేలంలో మెజార్టీ ప్లాట్లను రూ.8 వేలకు గజం చొప్పున విక్రయించారు. కుడా చైర్మన్‌గా సుందర్‌రాజ్ యాదవ్ నియామకం అయ్యాక 2022 నవంబర్ 13న ‘మా సిటీ’లో రెండో దఫా 98 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఈసారి గజం ధర రూ. 8 వేలుగా నిర్ణయించగా, యావరేజీగా రూ.17 వేలకు గజం పలికింది.
135 ఎకరాల్లో ‘ఉని సిటీ'
హనుమకొండ సిటీ నుంచి వడ్డేపల్లి చౌరస్తా, ఫిల్టర్ బెడ్ మీదుగా ఓఆర్‌ఆర్‌కు వెళ్లే మార్గంలో ఉని సిటీని డెవలప్ చేసేందుకు కుడా ప్లాన్ చేసింది. రింగ్ రోడ్డును ఆనుకుని ఉనికిచర్ల గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా దీనిని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ 135 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉండగా గతంలో ఈ భూమిని పొందిన వారికి కూడా షేర్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. ప్రతీ ఎకరానికి 600 గజాలు ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ వెంచర్‌ను ఈ నెల 20న వేలం వేసేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో 10 ఎకరాల్లో 200, 300 గజాల చొప్పున ప్లాట్లు చేసి వేలం వేసేలా ప్లాన్ చేశారు. గజానికి రూ. 12 వేల రేటు నిర్ణయించారు. వేలంలో గజం ధర రూ. 20 వేల వరకు పలకవచ్చని భావిస్తున్నారు.
20న ‘ఉని సిటీ’ ప్లాట్ల వేలం
కుడా తరఫున ఉనికిచర్ల ఓఆర్‌ఆర్ వద్ద ‘ఉని సిటీ’ టౌన్‌షిప్ ప్లాన్ చేసింది నిజమే. సిటీకి దగ్గర్లో ఉండేలా మూడో ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. మొత్తం 135 ఎకరాలు ఉండగా మొదటి దశలో 10 ఎకరాలకు ఈ నెల 20న వేలం నిర్వహిస్తాం. గజం ధర రూ.12 వేలు అనుకుంటున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తాం.
- సుందర్‍రాజ్ యాదవ్, కుడా చైర్మన్