జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బాధ్యతగా ఆడి ఆదుకోవాల్సిన రిషబ్ పంత్ ర్యాంప్ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. వింత వింత షాట్స్ ఆడి పరుగులు రాబట్టడమనేది అతని శైలి అయినప్పటికీ.. బాక్సింగ్ డే టెస్టులో పంత్ ఔటైన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకరకంగా ఇగోకు పోయి వికెట్ సమర్పించుకున్నాడు. జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు. దాంతో, పంత్ పై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ నిప్పులు చెరిగారు.
ఓవర్ నైట్ స్కోర్ 164/5తో మూడో ఆట ప్రారంభించిన టీమిండియా కొద్దిసేపటికే పంత్ రూపంలో వికెట్ కోల్పోయింది. భారత ఇన్నింగ్స్ 56 ఓవర్‌లో బోలాడ్ వేసిన బంతిని స్కూప్ షాట్ ఆడబోయిపంత్ (28).. నాథన్ లయన్ చేతికి చిక్కాడు. స్కూప్ షాట్ ఆడటం పంత్‌కు అలవాటే అయినప్పటికీ.. ఒకసారి మిస్ అయ్యిందని తదుపరి బంతిని మరలా అదే షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. దాంతో, బంతి ఎడ్జ్ తీసుకొని డీప్ థర్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉన్నలయాన్ చేతుల్లోకి వెళ్లి వాలింది. అసలే టీమిండియాకు ఒకవైపు ఫాలోఆన్ గండం ఉంటే.. మరోవైపు స్పెషలిస్ట్ బ్యాటర్లూ లేరు. ఇవేమి ఆలోచించని పంత్ అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు.
ఏమాట అది.. బాధ్యత లేదా..!
పంత్ వికెట్‌పై సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్.. ఇది మూర్ఖత్వం కాదు, అంతకుమించి.. మీరు అటువంటి షాట్ ఆడతారని తెలిసి అక్కడ ఇద్దరు ఫీల్డర్లు ఉంచారు. అయినప్పటికీ అలాంటి షాట్ ఆడారంటే మిమ్మల్ని ఏం అనాలో అర్థం కావట్లేదు. జట్టు పరిస్థితులు కాదు.. మీ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. ఇది మీ సహజమైన ఆట అని చెప్పుకోవడం అర్థం లేనిది.." అని గవాస్కర్ పంత్ పై ఫైర్ అయ్యారు.
One-Sided Kalesh b/w Sunil Gavaskar Saab and Rishabh Pant after he got Out:
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 28, 2024
pic.twitter.com/ULxQofgP6f
రెచ్చగొట్టిన హర్షా భోగ్లే
అసలే గవాస్కర్ అగ్గిమీద గుగ్గిలం అవతుంటే.. హర్షా భోగ్లే ఆయనను మరింత రెచ్చగొట్టారు. ఇలాంటి షాట్ ఆడి ఔటయ్యాక పంత్ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి తన ముఖం ఎలా చూపించగలడు అని హర్షా భోగ్లే అనగా.. 'అతను ఆ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లకూడదు! ఇతర డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాలి..' అని గవాస్కర్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.