హైదరాబాద్: దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం తొలి ఒప్పందం విజయవంతంగా చేసుకున్నది. అంతర్జాతీయ కంపెనీ అయిన యూనిలివర్ గ్లోబల్ సీఈవోతో జరిపిన చర్చల్లో.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీథర్ బాబు, ఇతర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న సహాయసహకారాలను వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. యూనిలివర్ గ్లోబల్ సీఈవోతో జరిపిన చర్చల్లో.. తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఆ కంపెనీ సీఈవోతో ఒప్పందం చేసుకున్నది తెలంగాణ ప్రభుత్వం.
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఇఎఫ్) వార్షిక సదస్సు 2025లో తెలంగాణకు పెట్టుబడులు వేట మొదలయ్యింది. ఈ మేరకు దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం కుదుర్చుకుంది. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్‌లలో ఒకటైన యూనిలీవర్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల బృందం జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి.
Also Read :- స్టాక్ మార్కెట్ మంగళవారం మంటలు
తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తోన్న రాయితీల గురించి యూనిలివర్ కంపెనీ సభ్యులకు తెలంగాణ ప్రతినిధుల బృందం క్షుణ్ణంగా వివరించింది. దీంతో తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు యూనిలివర్ కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనిలివర్, రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. తొలి విడతలో భాగంగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యూనిలివర్ కంపెనీ.. అలాగే రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యూనిలివర్ కంపెనీ ముందుకు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. యూనిలివర్ కంపెనీ ద్వారా రాష్ట్రంలో యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దావోస్ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర బృందం.. దాదాపు రూ.40 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్శించిన విషయం తెలిసిందే. ఈసారి అంతకంటే ఎక్కువ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.