- రాష్ట్రంలో యూనిలీవర్ యూనిట్లు
- దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో అంగీకారం
- కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ కేంద్రం
- మరోచోట బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్.. సీఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఒప్పందం
- ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ కోసం స్కైరూట్ ఎంవోయూ
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో రెండు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనిలీవర్ కంపెనీ ముందుకొచ్చింది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్, మరోచోట బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది.
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ బృందం రెండో రోజైన మంగళవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. వారికి తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను సీఎం వివరించారు.
స్పందించిన యూనిలీవర్ సీఈవో హీన్ షూ మేకర్.. తెలంగాణలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని, కామారెడ్డి జిల్లాలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని సీఎం వెల్లడించారు.
బాటిల్ క్యాప్‌ల ఉత్పత్తి కోసం కూడా తెలంగాణలో యూనిట్ ఏర్పాటు చేస్తామని యూనీలివర్ బృందం తెలిపింది. వినియోగ వస్తువుల తయారీ (ఎఫ్ఎంసీజీ )లో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన యూనిలీవర్ సంస్థ.. తన ఉత్పత్తులను ఎక్కువగా ద్రవ రూపంలో సీసాల్లో విక్రయిస్తుంటుంది.
ప్రస్తుతం ఈ బాటిల్ క్యాప్ లను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే బాటిల్ క్యాప్‌ల యూనిట్ ద్వారా వీటి కొరత తీరనుంది.
తెలంగాణ రైజింగ్ 2050 విజన్‌తో ముందుకు
దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణ వారధిగా ఉంటుందని, అను కూల వాతావరణంతో పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అనుకూలతలు ఉన్నాయని యూనిలీవర్ ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
‘‘తెలంగాణలో వినియోగ వస్తువులకు భారీ మార్కె ట్ ఉంది. సులభతర వ్యాపార విధానాలు అదనపు బలం. తెలంగాణ రైజింగ్ 2050 విజన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళిక అందరినీ ఆకర్షిస్తున్నది” అని సీఎం తెలిపారు.
దేశంలో యూనిలీవర్ తయారీ కేంద్రాలున్నప్పటికీ.. ఈ కంపెనీ తెలంగాణలో విస్తరించలేదు. దేశంలో అత్యధికంగా విస్తరణ అవకాశాలున్న వాటిపై దృష్టి సారించి, అటువంటి రంగాల్లోనే పెట్టుబడులు పెట్టాలని కంపె నీ ప్రతినిధులతో రేవంత్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
యూనిలీవర్ సీఈవో హీన్ షూ మేకర్, ఆ కంపెనీ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్, ఇండస్ట్రీస్ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, ఇన్వెస్ట్ మెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రైవేట్ రాకెట్తయారీకి స్కైరూట్‌తో ఒప్పందం తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఒప్పందం చేసుకున్నది.
హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ.. అంతరిక్ష సాంకేతిక రంగంలో విశేష కృషి చేస్తున్నది. దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఒప్పందం ప్రకారం.. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది.
హైదరాబాద్‌కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందని సీఎం ప్రశంసించారు. ‘‘తెలంగాణ యువకులు ప్రపం చంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించటంతో పాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు అభినందనలు.
స్కైరూట్ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెపుతుంది. ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు త్వరలోనే హైదరాబాద్‌ను కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తాం” అని ఆయన చెప్పారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం తమ కు సంతోషంగా ఉందని స్కై రూట్ కో ఫౌండర్ పవ న్ కుమార్ చందన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ లక్ష్య సాధనలో భాగస్వాములవుతామని పేర్కొన్నారు.