- యూనియన్ బ్యాంకులో 1500 పోస్టులకు నోటిఫికేషన్
బ్యాంకు సేవలను మారుమూల ప్రాంతాలకూ సమర్థంగా విస్తరించడంతో పాటు స్థానిక అవసరాలు తీర్చే లక్ష్యంతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందుకే ఈ నియామకాలకు స్థానిక భాషలో మాట్లాడటం, చదవడం, రాయడం తప్పనిసరి. మొదటి నెల నుంచే రూ.48,480 బేసిక్ సాలరీ అందుతుంది. అన్ని అలవెన్సులతో సుమారు రూ.77 వేల వరకు జీతం అందుతుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ మీడియంలో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో పావు శాతం తగ్గిస్తారు. ప్రతి విభాగంలోనూ కనీస అర్హత మార్కులు పొందాలి. వీటిని బ్యాంకు నిర్ణయిస్తుంది. అలాగే విభాగాలన్నీ కలిపీ నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించాలి. ఇలా అర్హులైనవారిని మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకీ ముగ్గురిని చొప్పున ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఆ రాష్ట్రానికి చెందిన భాషను పది లేదా ఇంటర్‌లో చదవనివారికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూకి వంద మార్కులు. ఇందులో అర్హతకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు 35, ఇతర వర్గాలవారు 40 శాతం మార్కులు పొందాలి. తుది నియామకాలు ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ మార్కులతో ఉంటాయి. పరీక్ష మార్కులను 80కి, ఇంటర్వ్యూని 20కి కుదించి, వచ్చిన మార్కులను కలిపి, మెరిట్, రిజర్వేషన్, స్టేట్ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు.
సిలబస్
జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్: బ్యాంక్ వ్యవహారాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఆర్‌బీఐ, బ్యాంక్ పదజాలం, బీమా, రెపో, రివర్స్ రెపో, వడ్డీరేట్లు, బ్యాంకుల రోజువారీ కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు- ప్రధాన కార్యాలయాలు-, అధిపతులు.. ఇవన్నీ తెలుసుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో.. పర్యావరణం, వర్తమాన అంశాలు, రోజువారీ సంఘటనలు, భారతదేశం, పొరుగు దేశాలతో సంబంధాలు.. వీటిపైనా ప్రశ్నలు సంధిస్తారు. వార్తల్లోని వ్యక్తులు, ఎన్నికలు, క్రీడలు, అవార్డులు, పథకాలు, దేశాలు- రాజధానులు, కరెన్సీలు, ప్రధాని/అధ్యక్షుడు, రాజధాని .. మొదలైనవి చూసుకోవాలి. నియామకాలు, విజేతలు, పుస్తకాలు, -రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలకు ప్రాధాన్యమివ్వాలి. దినపత్రికలు చదివే అలవాటుంటే అధిక మార్కులు వస్తాయి. చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలు రాసుకుంటే గుర్తుంటాయి. ఎకానమీలో డిమాండ్- సప్లై, ద్రవ్యోల్బణం, పేదరికం, మార్కెట్ రకాలు, జాతీయ, అంతర్జాతీయ సమకాలీనాంశాలపై దృష్టి సారించాలి. బ్యాంకుల ఆర్థిక వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్: గ్రామర్ బాగా ప్రాక్టీస్ చేయాలి. వేగంగా చదివి, సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యాలు ఉండాలి. ఆంగ్ల దినపత్రికల్లో ముఖ్యమైన వ్యాసాలు చదివితే పద సంపద పెరుగుతుంది. కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్టు, జంబుల్డ్ సెంటెన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్/కరెక్షన్, వర్డ్ సబ్‌స్టిట్యూషన్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినానిమ్స్- యాంటానిమ్స్, వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్‌ల్లో ప్రశ్నలు రావచ్చు.
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్: సిలాజిజం, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్-డీకోడింగ్, క్లాక్, క్యాలెండర్, సీటింగ్ అరేంజ్‌మెంట్, రక్త సంబంధాలు, పజిల్, స్టేట్‌మెంట్లు, సిరీస్, దిక్కులు, ర్యాంకింగ్, సీక్వెన్స్, ఇన్‌పుట్/అవుట్‌పుట్.. ఇలా ప్రతి అంశం నుంచీ ప్రశ్నలుంటాయి. ఇచ్చిన సమాచారం ఆధారంగా బాగా ఆలోచించి, తర్కం ఉపయోగించి సమాధానం గుర్తించవచ్చు. కంప్యూటర్/ఐటీలకు సంబంధించి.. ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి.
డేటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్: ఈ విభాగంలో రాణించడానికి తక్కువ సమయంలో జవాబులు గుర్తించగలిగే నైపుణ్యం అవసరం. సూక్ష్మీకరణలపై పట్టు సాధించాలి. ప్రశ్నను బట్టి సూత్రం లేదా తర్కం ఉపయోగించి సమాధానం గుర్తించడం అలవాటు చేసుకోవాలి. బార్‌గ్రాఫ్, లైన్ చార్ట్, టేబులర్ ఫార్మాట్, పై చార్ట్, మిస్సింగ్ డేటా, కేస్‌లెట్, డేటా సఫిషియన్సీ.. విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. శాతాలు, నిష్పత్తి- అనుపాతం, లాభ నష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం- దూరం, కాలం- పని, పడవలు- ప్రవాహాలు, రైళ్లు, సరాసరి, వ్యాపార భాగస్వామ్యం, వైశాల్యాలు, ఘన పరిమాణాలు- ఇలా ప్రతి అంశం నుంచీ ఒక ప్రశ్న రావొచ్చు.
ప్రిపరేషన్ స్ట్రాటజీ
కొత్తగా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ముందుగా సిలబస్‌లో ఇచ్చిన విభాగాలకు సంబంధించి బేసిక్స్ మీద అవగాహన పెంచుకోవాలి. అనంతరం ఎక్కువ మార్కులు సాధించడానికి తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. ఆ తర్వాత కఠినమైనవి అధ్యయనం చేయాలి. ప్రిపరేషన్ అనంతరం వీలైనన్ని మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. దీంతో పరీక్ష విధానానికి అలవాటు పడటమే కాకుండా నిర్ణీత సమయంలో ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుస్తుంది. దాని ప్రకారం ఎంత వేగంతో సమాధానం ఇవ్వాలో అర్థం చేసుకుని, సన్నద్ధత మెరుగుపరుచుకోవాలి. ఆన్సర్ రాబట్టడానికి ఎక్కువ సమయం తీసుకునే టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మాదిరి ప్రశ్నపత్రాలను విశ్లేషించుకుంటూ పరీక్షకు సిద్ధమైతే తక్కువ వ్యవధిలోనే అంశాలు, సమయపాలనపై పట్టు సాధించవచ్చు. ఎగ్జామ్‌లో ఎక్కువ ప్రశ్నలకు వ్యవధి సరిపోదు. అందువల్ల ఉన్న సమయంలో వీలైనన్ని సరైన సమాధానాలు గుర్తించినవారే విజేత కాగలరు. దీని కోసం ప్రశ్నలను ఎంచుకో వడం కీలకం.
ఎక్కువ మార్కులు సాధించడానికి డేటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలి. దీని తర్వాత రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ప్రాధాన్యమైనది. ఈ రెండు విభాగాల్లో మెరుగైన మార్కులు పొందినవారు విజయానికి దగ్గరవుతారు. నిర్ణీత వ్యవధిలో ఈ విభాగాల్లో ప్రశ్నలకు సమాధానం రాయాలంటే గణిత సూత్రాలు, అనువర్తనం, షార్ట్ కట్ మెథడ్స్ వీటిని బాగా తెలుసుకోవాలి. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఐబీపీఎస్, ఎస్‌బీఐ పీవో పాత ప్రశ్నపత్రాలను నిశితంగా గమనించాలి. దీనిద్వారా ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నారు, సన్నద్ధత ఎలా ఉంది, ఏ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాలి, వేటికి ఎంత సమయం కేటాయించాలో తెలుస్తుంది. నెగెటివ్ మార్కులు ఉన్నందున తెలియనివి వదిలేయాలి. ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష పూర్తికాగానే డిస్క్రిప్టివ్ కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఇప్పటి నుంచే రాత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. విషయంతోపాటు, వ్యక్తీకరించిన విధానానికి మార్కులు ఉంటాయి.
నోటిఫికేషన్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్. స్థానిక భాషను పది లేదా ఇంటర్‌లో చదవాలి. లేనివారు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టు రాయాలి. వయసు 1 అక్టోబర్ 2024 నాటికి కనీసం 20 ఏళ్లు నిండాలి. గరిష్టంగా 30 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఈడబ్ల్యుఎస్, ఓబీసీలకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. పూర్తి వివరాలకు www.unionbankofindia.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.
పరీక్ష విధానం
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 60
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ 40 40
డేటా ఎనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 35 60
ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 40
మొత్తం 155 200
ఇంగ్లీష్ లాంగ్వేజ్(లెటర్ రైటింగ్, ఎస్సే) 2 25