- ఇది దేశాభివృద్ధి బడ్జెట్ కాదు.. అధికారాన్ని కాపాడుకునేది: ఖర్గే
- అత్యధిక జనాభా ఉన్న యూపీని పూర్తిగా విస్మరించారు: అఖిలేశ్
- రాజకీయ పక్షపాతం.. పేదల వ్యతిరేకం: మమత
- ఇది బడ్జెట్కాదు.. మోదీ సర్కార్ బచావ్ యోజన: శివసేన (యూబీటీ)
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలను విస్మరించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇది దేశాభివృద్ధి కోసం తెచ్చిన బడ్జెట్ కాదని.. తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మాత్రమే పరిమితమైందని విమర్శించాయి. బీజేపీ తన మిత్రపక్షాలను సంతృప్తిపరుస్తూ, సంతోష పెడుతూ.. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం మొండిచేయి చూపిందని మండిపడ్డాయి. బడ్జెట్‌తో అసలైన పనుల కంటే ఫోజులపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతున్నదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపించింది.
దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనారిటీలు, మధ్యతరగతి, గ్రామీణ పేదల కోసం గత యూపీఏ ప్రభుత్వ హయాంలో తాము తీసుకొచ్చినట్టు.. ఈ బడ్జెట్లో ఒక్క మంచి స్కీమ్ కూడా లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ‘‘మోదీ ప్రభుత్వ ‘కాపీ క్యాట్ బడ్జెట్’.. కాంగ్రెస్ న్యాయ పాత్రను కూడా సరిగ్గా కాపీ చేయలేకపోయింది. మోదీ ప్రభుత్వం సగంసగం మనస్సుతో సంక్షేమ పథకాలు, ‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు’ అనే నకిలీ ప్రకటనలు చేసింది” అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. దేశంలో ఏటేటా పెరిగిపోతున్న నిరుద్యోగుల గురించి ఈ బడ్జెట్లో ఏమీ చెప్పలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ లో విమర్శించారు. బడ్జెట్ పేరిట నిర్మల.. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోను చదవడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం అన్నారు.
బడ్జెట్‌పై నిరసనలు
బడ్జెట్‌లో తమ రాష్ట్రాలను విస్మరించారని, వివక్ష చూపారని ఆరోపిస్తూ పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, మహారాష్ట్రకు చెందిన మహా వికాస్ అఘాడీ ఎంపీలు నిరసనకు దిగారు. యువత, రైతుల ప్రయోజనాలను బడ్జెట్ విస్మరించిందంటూ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు ఈ బడ్జెట్లో ఏమైనా ఉందా అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘‘రాజకీయ పక్షపాతం, పేదలకు వ్యతిరేకం” అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బడ్జెట్లో పశ్చిమ బెంగాల్ పేరు కూడా లేదని.. అంత తప్పు తమ రాష్ట్రం ఏం చేసిందని ప్రశ్నించారు. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ బడ్జెట్‌ను ‘‘ప్రధాన్ మంత్రి సర్కార్ బచావో యోజన”అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఐదేండ్లు కాపాడుకునే ప్రయత్నంలో బీహార్, ఏపీ లకు ప్యాకేజీ ఇచ్చారని.. ఇది బీజేపీ సిగ్గుపడాల్సిన విషయమని మండిపడ్డారు.