Mobile Tariff: బడ్జెట్ వల్ల రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గేది ఉందా..? మరింత పెరిగే ఛాన్స్ ఉందా..?

Mobile Tariff: బడ్జెట్ వల్ల రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గేది ఉందా..? మరింత పెరిగే ఛాన్స్ ఉందా..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై దేశం మొత్తం చర్చించుకుంటోంది. బడ్జెట్లో ఉన్న మంచిచెడులు, ధరలు తగ్గేవేంటి..? పెరిగేవేంటి..? ఇలా మధ్యతరగతి ప్రజలు బడ్జెట్లోని అంశాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రభావం వల్ల మొబైల్ టారిఫ్ ధరలు తగ్గనున్నాయా..? పెరగనున్నాయా..? అనే సందేహం కూడా సామాన్యుల్లో కలిగింది. ఈ సందేహానికి సమాధానం దొరికింది. టెలికాం ఎక్విప్మెంట్పై ప్రస్తుతం విధిస్తున్న 10 శాతం పన్నును కేంద్రం 15 శాతానికి పెంచింది. దీంతో.. టెలికాం కంపెనీల షేర్లు దెబ్బకు పడిపోయాయి. మొబైల్ పార్ట్లపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించిన కేంద్రం, టెలికాం ఎక్విప్మెంట్ పై మాత్రం పన్నును పెంచింది. టెలికాం కంపెనీలు ఈ భారాన్ని యూజర్లపై నేరుగా మోపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ప్రభావంతో రీఛార్జ్ ప్లాన్ల ధరలు మరోమారు పెరిగే అవకాశం ఉంది. 

Also Read :- కేంద్ర బడ్జెట్పై సీఎం రియాక్షన్ మాములుగా లేదుగా

జులైలోనే భారత్ లోని టాప్ 3 టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వీఐ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. 5జీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో టెలికాం ఎక్విప్మెంట్పై సదరు టెలికాం సంస్థలు భారీగానే ఖర్చు చేయనున్నాయి. ఈ భారం రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపు రూపంలో యూజర్లపై పడనుంది. మొబైల్ ధరలు తగ్గనున్నాయని సంతోషించే లోపే రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలు మొబైల్ యూజర్లను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. 2024లో ఇప్పటికే టెలికాం కంపెనీలు యూజర్లపై టారిఫ్ పెంపుతో భారాన్ని మోపాయి. జులై 3 నుంచి రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంపు అమల్లోకి రావడంతో యూజర్లు 15 నుంచి 25 శాతం వరకూ అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 5జీ విస్తరణ కోసం ఈ నిర్ణయం తప్పలేదని టెలికాం కంపెనీలు చెప్పినప్పటికీ యూజర్లపై మాత్రం పెను భారమే పడింది.