- మధ్యతరగతి ప్రజలకు భరోసాఉద్యోగాల కల్పనకు ఊతం
- యూత్‌కు అపార అవకాశాలు లభిస్తాయని వ్యాఖ్య
న్యూఢిల్లీ: మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా బడ్జెట్ ఉందని ప్రధాని మోదీ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని కొనియాడారు. యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి ప్రజలు, వెనుకబడిన వర్గాలు, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ సెక్టార్లు, ఎంఎస్ఎంఈలు... ఇలా అన్ని వర్గాలు, రంగాలపై ఫోకస్ పెట్టారని పేర్కొన్నారు. బడ్జెట్ పై మంగళవారం దేశ ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘పల్లెలు, పేదలు, రైతులను అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బడ్జెట్ ఇది. గత పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజల సాధికారతే లక్ష్యంగా ప్రవేశపెట్టాం. ఇది మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా మరింత బలోపేతమయ్యేందుకు దోహదపడుతుంది. ఇందులో గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ముఖ్యమైన ప్రణాళికలు ఉన్నాయి” అని మోదీ తెలిపారు. మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఈ బడ్జెట్ ఉత్ప్రేరకంగా పని చేస్తుందని, ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు గట్టి పునాది వేస్తుందని పేర్కొన్నారు.
కొత్త స్కీమ్‌తో కొట్లాది ఉద్యోగాలు..
ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చే విధంగా బడ్జెట్ ఉందని మోదీ అన్నారు. దీని ద్వారా యువతకు అపారమైన అవకాశాలు వస్తాయని చెప్పారు. ‘‘ఈసారి ప్రవేశపెట్టిన ఎంప్లాయ్ మెంట్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తో కొట్లాది ఉద్యోగాలు లభిస్తాయి. ఈ స్కీమ్ కింద కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు ఒక నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే విధంగా అప్రెంటిస్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా కోటి మంది యువతకు లబ్ధి చేకూరనుంది. వాళ్లు పెద్ద కంపెనీల్లో పని చేసేందుకు అవకాశం దొరుకుతుంది” అని తెలిపారు. ‘‘డిఫెన్స్ సెక్టార్ లో స్వావలంబన కోసం ఆ శాఖకు అధి కంగా నిధులు కేటాయించాం. కొన్ని పన్నులను తగ్గిం చాం. టీడీఎస్ రూల్స్ ను సరళీకరించాం.టూరిజం సెక్టార్ కూ ప్రాధాన్యం ఇచ్చాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకోసం పూర్వోదయ స్కీమ్ ను తీసుకొచ్చాం. దీని కింద ఆయా రాష్ట్రాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. హైవేలు, వాటర్, పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తాం” అని పేర్కొన్నారు.
స్టార్టప్స్‌కు బూస్టప్..
మహిళలు, రైతులకూ బడ్జెట్ లో పెద్దపీట వేశామని మోదీ అన్నారు. ‘‘మన దేశం అగ్రికల్చర్ సెక్టార్ లో స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉంది. అందుకోసం చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే గ్రెయిన్ స్టోరేజ్ స్కీమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ‘వెజిటెబుల్ ప్రొడక్షన్ క్లస్టర్’ స్కీమ్ ప్రకటించాం. దీని ద్వారా రైతులకు, మిడిల్ క్లాస్ కు లబ్ధి చేకూరుతుంది” అని తెలిపారు. ముద్ర లోన్ల పరిమితిని రూ.20 లక్షలకు పెంచామని.. దీంతో మహిళలు, చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్, స్పేస్ ఎకానమీకి కొత్త అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.