- నమామి గంగే మిషన్‌కు రూ.3,400 కోట్లు
- గ్రామాల్లో శానిటేషన్ వ్యవస్థపై కేంద్రం దృష్టి
- స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద రూ.7వేల కోట్లు
- ‘అటల్ భూజల్ యోజన’కు రూ.1,780 కోట్ల కేటాయింపు
న్యూఢిల్లీ: తాగునీరు, శానిటేషన్ శాఖకు 2025–26 కేంద్ర బడ్జెట్‌లో రూ.74,226 కోట్లు కేటాయించారు. ఇందులో జల్ జీవన్ మిషన్‌కే అత్యధిక నిధులు ఉన్నాయి. 2024–25 సంవత్సరానికి సవరించిన అంచనా రూ.29,916 కోట్ల కన్నా గణనీయంగా నిధులు పెరిగాయి. అయితే, 2024–25 బడ్జెట్‌లో ఈ శాఖకు మొదట కేటాయించిన రూ.77,390.68 కోట్ల కంటే ఈ నిధులు తక్కువే. జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవ శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.25,276.83 కోట్లు కేటాయించారు. సవరించిన అంచనాల నుంచి రూ.21,640.88 కోట్లు పెరిగింది.
నమామి గంగే మిషన్ – 2 కింద నదిని శుభ్రపరచడం, పునరుజ్జీవింపజేయడం కోసం రూ.3,400 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.3,000 కోట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో శానిటేషన్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు కేంద్రం నిర్ణయించింది. గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) పరిస్థితిని కొనసాగింపు, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల అమలు చేయనున్నది. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద నిరుడు మాదిరిగానే ఈ బడ్జెట్లోనూ రూ.7,192 కోట్లు కేటాయించారు.
గిరిజనులకు మంచి తాగునీరు, పారిశుధ్య సౌకర్యాల పథకమైన ‘ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ కోసం రూ. 341.70 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరోవైపు జల్ జీవన్ మిషన్ కింద సమాచారం, విద్య, కమ్యూనికేషన్ల కోసం రూ.80 కోట్లు, మిషన్ నిర్వహణకు రూ.13.50 కోట్లు, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ (ఎస్పీఎం–నివాస్)కు రూ. 89.53 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో తాగునీరు, సాగు నీటి సరఫరా కోసం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో రూ.5,936 కోట్లు కేటాయించారు. ఇతర కీలక ప్రాజెక్టుల్లో భూగర్భ జల నిర్వహణ పథకమైన ‘అటల్ భూజల్ యోజన’కు రూ.1,780 కోట్లు, భూగర్భ జల నియంత్రణకు రూ.509 కోట్లు కేటాయించారు.