ఎడ్యుకేషన్​లో ఏఐ.. ఇకపై డిజిటల్‌‌‌‌ రూపంలో పాఠ్య పుస్తకాలు

ఎడ్యుకేషన్​లో ఏఐ..  ఇకపై డిజిటల్‌‌‌‌ రూపంలో పాఠ్య పుస్తకాలు

 

  • ‘భారతీయ భాషా పుస్తక్‌‌‌‌’ స్కీమ్​పై ప్రకటన
  • విద్యా రంగానికి రూ.1.28 లక్షల కోట్ల కేటాయింపు
  • 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు

న్యూఢిల్లీ: విద్యా రంగానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం రూ.1.28 లక్షల కోట్లు కేటాయించారు. డిపార్ట్​మెంట్ ఆఫ్ స్కూల్ అండ్ లిటరసీకి రూ.78,572 కోట్లు, హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​కు రూ.50,077 కోట్లు కేటాయించారు. మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపు, ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు, ఐఐటీ పాట్నా విస్తరణ, రానున్న ఐదేండ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. భారత్ నెట్ ప్రాజెక్ట్​లో భాగంగా.. గవర్నమెంట్ సెకండరీ స్కూల్స్​లో బ్రాడ్‌‌‌‌బ్యాండ్ కనెక్టివిటీని మెరుగుపరచడంపై దృష్టిపెట్టినట్లు నిర్మల వివరించారు.

అటల్ టింకరింగ్ ల్యాబ్ అంటే?

అటల్ టింకరింగ్ ల్యాబ్​లు.. అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద వస్తుంది. దీన్ని నీతి ఆయోగ్ ప్రారంభించింది. స్కూల్ స్టూడెంట్లలో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నారు. స్టూడెంట్లకు సరికొత్త టెక్నాలజీని అందించడం, వాళ్లను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం అటల్ టింకరింగ్ ల్యాబ్ లక్ష్యం. ముఖ్యంగా భవిష్యత్తులో స్టార్టప్‌‌‌‌ల వైపు విద్యార్థులను ఆకర్షించడం, వారు ఇన్నోవేటర్లుగా ఎదగడానికి సహాయపడుతుంది. ఈ ల్యాబ్‌‌‌‌లలో త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఏఐ, 
సెన్సర్స్ వంటి ఆధునిక టెక్నాలజీలను విద్యార్థు లకు పరిచయం చేయనున్నారు.

‘భారతీయ భాషా పుస్తక్‌‌‌‌’ స్కీమ్​

విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కేంద్రం 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. దీని కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. విద్యా విధానం, పరిశోధనల్లో ఏఐని అనుసంధానించేందుకు ఇది తోడ్పాటునందిస్తుంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ‘భారతీయ భాషా పుస్తక్‌‌‌‌’ పథకాన్ని తీసుకొస్తున్నట్లు నిర్మలా ప్రకటించారు. దీనిద్వారా పాఠ్య పుస్తకాలను అన్ని భారతీయ భాషల్లో డిజిటల్‌‌‌‌ రూపంలో తీసుకురానున్నారు. రానున్న పదేండ్లలో అదనంగా 1.1 లక్షల యూజీ, పీజీ వైద్య సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాదికి కనీసం 10 వేల సీట్లు చొప్పున రానున్న ఐదేండ్లలో 75వేల మెడికల్‌‌‌‌ సీట్లను పెంచాలని నిర్ణయించింది.

‘మేక్‌‌‌‌ ఇన్‌‌‌‌ ఇండియా, మేక్‌‌‌‌ ఫర్‌‌‌‌ ది వరల్డ్‌‌‌‌’

నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యలో పెట్టుబడులపై దృష్టిసారించడంలో భాగంగా దేశవ్యాప్తంగా 5 నేషనల్‌‌‌‌ సెంటర్స్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఎక్సలెన్స్‌‌‌‌ కేంద్రాలను స్థాపించనున్నారు. ‘మేక్‌‌‌‌ ఇన్‌‌‌‌ ఇండియా, మేక్‌‌‌‌ ఫర్‌‌‌‌ ది వరల్డ్‌‌‌‌’కు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకునేందుకు, అందుకనుగుణంగా యువతను సన్నద్ధం చేయడానికి ఇవి దోహదం చేయనున్నాయి. సాంకేతిక పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు వీలుగా రానున్న ఐదేండ్లలో ఐఐటీ, ఐఐఎస్‌‌‌‌సీలకు 10వేల ఫెలోషిప్‌‌‌‌ పోస్టులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

లిటరసీకి  : రూ. 78,572 కోట్లు
హయ్యర్  ఎడ్యుకేషన్​కు :  రూ. 50,077 కోట్లు
 మొత్తం  రూ.1.28 లక్షల కోట్లు