ఆర్థిక శక్తిగా భారత్​

ఆర్థిక శక్తిగా భారత్​

వచ్చే 25 ఏండ్ల అమృతకాలం లక్ష్యంగా రూపుదిద్దుకున్న కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు, కలలను నెరవేర్చబోతున్నది. 2047లో వందేండ్ల స్వాతంత్య్ర వేడుకల నాటికి ఆవిష్కరించబోయే ‘మహాన్‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌’కు భూమిక సిద్ధం చేసే దిశగా బడ్జెట్ అన్ని రంగాల అభివృద్ధికి పెద్ద పీట వేసింది. దేశంలో ఉత్పత్తిదారులైన కులవృత్తుల వారికి ‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్(పీఎం వికాస్)’తో బడ్జెట్​లో తొలిసారి ప్రాధాన్యం దక్కింది. ఈ తరహా ప్రయత్నం మునుపెన్నడూ జరగలేదు. 

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టిన మోడీ ప్రభుత్వం తాజా బడ్జెట్లో ‘సప్తర్షుల’ పేరిట సమ్మిళిత వృద్ధి, రీచింగ్ ది లాస్ట్ మైల్, సామర్థ్యాలు, నైపుణ్యాల వెలికితీత, గ్రీన్ గ్రోత్, యూత్ పవర్, ఆర్థిక రంగం బలోపేతం లాంటి ఏడు ప్రాధాన్యతాంశాలను ప్రకటించింది. ఈ ఏడు అంశాలు దేశాభివృద్ధికి బలమైన పునాది వేయనున్నాయి. మౌలిక వసతుల రంగంపై పెట్టుబడులను ఏకంగా రూ.10 లక్షల కోట్లకు పెంచడం మామూలు విషయం కాదు. ఈ చర్య ఆయా రంగాలను ఉత్తేజితం చేయడంతోపాటు, అదనపు ఉపాధి అవకాశాలు పెంచనుంది. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం తరుముకొస్తున్న పరిస్థితుల్లో మౌలికరంగ సదుపాయాల కల్పనకు ఇంత పెద్ద మొత్తంలో కేటాయింపులు జరపడం ప్రధాని మోడీ సాహసోపేత నిర్ణయమే! కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పన్నుల రూపంలో ఏ వర్గంపైనా అదనపు భారం మోపలేదు. పైగా మధ్య తరగతికి బడ్జెట్​లో అధిక ప్రాధాన్యం కల్పించింది. వేతన జీవులకు, రిటైర్డ్ ఉద్యోగులు, వయోవృద్ధులు, మహిళలకు ప్రయోజనం చేకూర్చే ఎన్నో అంశాలను బడ్జెట్​లో పొందుపరిచింది. ఆదాయపు పన్ను మినహాయింపు పెరగడం సగటు వేతన జీవికి అత్యంత ఉపశమనం కలిగిస్తున్నది. 

యాక్సిలరేటరీ ఫండ్ ​ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​లో వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని 11 శాతం పెంచుతూ రూ.20 లక్షల కోట్లుగా నిర్ణయించింది. పశుపోషణ, డెయిరీ, ఫిషరీస్ వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధుల కేటాయింపులు పెంచింది. ఫిషరీ మార్కెట్​ను విస్తరించేందుకు రూ.6 వేల కోట్లతో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అధిక విలువైన ఉద్యాన పంటల కోసం రూ. 2,200 కోట్లతో ఆత్మనిర్బర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్‌‌‌‌కు రూపకల్పన చేసింది. రూ. 2,516 కోట్లతో 63,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరీకరణ చేపట్టనున్నట్లు కేంద్రం బడ్జెట్లో పేర్కొన్నది. దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించే పీఎం ప్రణామ్ వంటి పథకాలను కొత్తగా తీసుకొచ్చింది. ఎరువులు, పురుగుమందుల తయారీ నెట్వర్క్​ను రూపొందించడానికి 10 వేల బయోఇన్పుట్ రీసోర్స్​మెంటర్లు, పంట స్టోరేజీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇవి అందుబాటులోకి వస్తే దేశంతోపాటు తెలంగాణలోని లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో యువ ఎంటర్​ప్రెన్యూర్ల స్టార్టప్​లను ప్రోత్సహించేందుకు యాక్సిలరేటరీ ఫండ్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ‘శ్రీ అన్న’(చిరుధాన్యాల) ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో, ఎగుమతిలో ద్వితీయ స్థానంలో ఉంది. శ్రీ అన్న’ గ్లోబల్ హబ్‌‌‌‌గా భారత్‌‌‌‌ను నిలిపేందుకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పన, అందరికీ అందించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్’ పనిచేస్తుందని కేంద్రం ప్రకటించడం విశేషం. ‘శ్రీఅన్న’తో ఆరోగ్య భారతానికి అడుగులు పడ్డాయి. 

ఆర్థిక శక్తిగా భారత్​

కేంద్ర బడ్జెట్​లో దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కీలక అంశాలను  పొందుపరిచారు. కులవృత్తులకు జవసత్వాలు కల్పించి ఉత్పాదక రంగానికి ఊపిరిలూదేందుకు  కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​లో విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన పథకం ప్రతిపాదించింది. కులవృత్తులు, హస్తకళలకు సంబంధించి దేశ వ్యాప్తంగా వేర్వేరు పేర్లతో దాదాపు140 కులాలు ఉన్నాయి. వారు తయారు చేసే ఉత్పత్తుల నాణ్యతను, సంఖ్యను పెంచుకునేందుకు పీఎం వికాస్ యోజన్ సహాయ సహకారాలు అందజేస్తుంది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలెంతోమందికి మేలు జరుగుతుంది.  ఈ స్కీంను స్కిల్ ఇండియా మిషన్తో కలిపి కేంద్ర మైనార్టీ శాఖ అమలు చేయనుంది. దేశంలో 81 లక్షల సెల్ప్ హెల్ప్ గ్రూపులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఎంఎస్ఎంఈలకు అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం మంత్రి వర్గ ఉప సంఘం కూడా ఏర్పాటు చేసింది. దేశ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయి. మొత్తంగా బడ్జెట్లో గతంతో పోలిస్తే  మౌలిక వసతులకు 33 శాతం నిధులు పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైవేలు, ఇతర కనెక్టివిటీలు పెరిగి, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 50 పర్యాటక కేంద్రాలను ఎంపిక చేసి, వాటిని ప్రపంచ స్థాయి కేంద్రాలుగా మౌలికంగా డెవలప్ చేయాలని, ‘దేఖో అప్నా దేశ్’ అనే కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకువెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. రైల్వేకు కూడా రికార్డు స్థాయిలో 2013–14తో పోలిస్తే 9 రెట్లు కేటాయింపులు పెరిగాయి. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి హైడ్రోజన్ ట్రైన్ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి  రానుంది. కరోనాతో అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి రేటు తగ్గినా, భారత్ వృద్ధి కొనసాగుతున్నది. 2004 నుంచి 2014 వరకు భారత జీడీపీ1 ట్రిలియన్ నుంచి 2 ట్రిలియన్ల డాలర్లకు పెరిగితే, అదే 2014 నుంచి 2019 వరకు అది 3.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. 2027 నాటికి 5.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందనడంలో సందేహం లేదు.  

ఓ విజన్​తో తీసుకొచ్చిన బడ్జెట్

భారత దేశ వర్తమాన వృద్ధిని ప్రోత్సహిస్తూ.. భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన జనరంజక బడ్జెట్ ఇది. ప్రధాని మోడీ ఈ దేశానికి అందించిన తొమ్మిది బడ్జెట్లలో తాజాది ప్రత్యేకమైనది. రాజకీయాలకు, ఎన్నికల తాయిలాలకు అతీతంగా దేశ ప్రగతి కోసమే ఓ విజన్​తో తీసుకొచ్చిన బడ్జెట్. ఇందులోని సంక్షేమం, అభివృద్ధి అంశాలు సాధారణ ప్రజలకు తెలియజేసేందుకు ప్రధాని మోడీ వేసిన బడ్జెట్ క్యాంపెయినింగ్ కమిటీలో నేను ఒక సభ్యుడిని. బడ్జెట్ క్యాంపెయినింగ్​లో భాగంగా ఇప్పటికే  ఉత్తరాదిలో అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించాను. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్​లో నిర్వహించిన ‘నో యువర్’ బడ్జెట్ కార్యక్రమంలో పాల్గొని బడ్జెట్ ప్రగతి అంశాలను వివరించాను. కేంద్ర ప్రయోజిత పథకాలైన ముద్ర, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ లాంటి వాటిపై ఇప్పటికీ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో సాధారణ ప్రజలకు పూర్తి అవగాహన లేదు. అందుకు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణం. బడ్జెట్ క్యాంపెయినింగ్ కమిటీ ఏర్పాటు వల్ల బడ్జెట్ అంశాలను ప్రజలకు వివరించే వెసులుబాటు కలిగింది. దేశంలోని ప్రతి పౌరుడు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య ఉద్దేశం.


జాతీయ భద్రతకు పెద్దపీట


దేశంలో అత్యధిక యూత్ పాపులేషన్ ఉన్న దేశం ఇండియానే. యువశక్తిని ఉత్పాదక శక్తిగా మలచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. యువతలో నైపుణ్యాలు పెంచి వారిని ఇండస్ట్రీల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దడం కోసం కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెకట్రానిక్స్, ఐవోటీ, 3డీ ప్రింటింగ్, డ్రోన్స్, సాఫ్ట్ స్కిల్స్ వంటి కొత్తతరం కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇప్పటికే మూడు దఫాలుగా ప్రధానమంత్రి కౌశల్ యోజన్ పథకం అమలు చేసిన కేంద్ర సర్కారు.. త్వరలో పీఎం కౌశల్ యోజన 4.0లో భాగంగా దేశంలో 4 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వనుంది. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా అనే విజన్​ను సాకారం చేసేందుకు  దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ఏఐ కోసం మూడు ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఇదీగాక యాప్స్ అభివృద్ధి చేసేందుకు ఇంజనీరింగ్ ఇన్​స్టిట్యూట్లలో 5జీ సర్వీస్ సౌకర్యం కలిగిన100 ల్యాబ్​లు పెట్టనున్నట్లు కేంద్రం బడ్జెట్​లో ప్రకటించింది. ఇలా నైపుణ్యాలు, అవకాశాలు, మౌలిక వసతుల కల్పన ద్వారా నేటి యువభారతం రేపు ఆవిష్కరణల్లో అద్భుతాలు సృష్టించబోతున్నది. మరోవైపు జాతీయ భద్రత విషయంలో ఏ మాత్రం రాజీపడని కేంద్ర ప్రభుత్వం.. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా, పాక్​లకు ధీటుగా బుద్ధి చెప్పేందుకు, రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు బడ్జెట్​లో రక్షణ శాఖకు నిధులు భారీగా పెంచింది. ఈసారి రక్షణ శాఖకు 5.94 లక్షల కోట్లు కేటాయించింది. ఈ మొత్తం గత బడ్జెట్ కేటాయింపుల కంటే 13 శాతం ఎక్కువ కాగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో డిఫెన్స్​కు కేటాయింపులు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మానవీయ ప్రభుత్వం..

దేశంలోని పేద, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం తాజా బడ్జెట్ పలు పథకాలను, కార్యక్రమాలను ప్రతిపాదించింది. పేదలకు ఉచిత ఆహారధాన్యాలు, డ్రైనేజీల క్లీనింగ్ కు వంద శాతం మెషీన్ల వాడకం, ప్రమాదంలో ఉన్న ఆదివాసీ, గిరిజన తెగల కోసం ప్రత్యేక కార్యక్రమం అమలు వంటివి ఇందులో ఉన్నా యి. కరోనా సమయంలో పీఎం గరీబ్ కల్యాణ్‌‌‌‌ అన్న యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలను సరఫరా చేసిన కేంద్ర ప్రభుత్వం, మరో ఏడాది కూడా కొనసాగించనున్నట్లు పేర్కొంది. పేదోడి సొంతింటి కలను నెరవేర్చడంలో భాగంగా కేంద్రం ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు బడ్జెట్ కేటాయింపులు భారీగా పెంచింది.  గత బడ్జెట్​లో పీఎంఏవైకు రూ.48 వేల కోట్లు కేటాయిస్తే,  ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79 వేల కోట్లు కేటాయించింది.  పెనాల్టీలు చెల్లించేందుకు లేదా బెయిల్ కోసం డిపాజిట్లు కట్టేందుకు డబ్బులు లేక ఏండ్లకేండ్లుగా జైలులోనే మగ్గుతున్న పేద ఖైదీలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించి మానవత్వం చాటుకున్నది. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగించనున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. అందుకు బడ్జెట్ లో రూ.13.7 లక్షల కోట్లు కేటాయించింది. 

- డా. వివేక్ వెంకటస్వామి,
కేంద్ర బడ్జెట్ క్యాంపెయినింగ్ కమిటీ మెంబర్