- ఉమ్మడి జిల్లా ప్రజలను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్
- డబుల్ రైల్వే లైన్, కొత్త ట్రైన్ల ఊసెత్తని కేంద్రం..
- జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టుకు నయాపైసా ఇవ్వని కేంద్రం
- ఉమ్మడి జిల్లా నుంచి 8 మంది బీజేపీ ఎంపీలున్నా శూన్యం
నిజామాబాద్, వెలుగు: కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీయే సర్కారు ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో ఇందూరు జిల్లాకు పూర్తిగా మొండి చేయి చూపింది. చాలా కాలంగా ఉన్న డిమాండ్లకు నిధులు కేటాయిస్తారని జిల్లా ప్రజలు గంపెడాశలతో ఉండగా ఆ ఊసే కనిపించలేదు. కీలకమైన అంశాల ప్రస్తావన తీసుకురాలేదు. సాధారణ పథకాలు మినహా డెవలప్మెంట్పనులకు నిధుల విషయంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలపై కేంద్రం చిన్నచూపు చూపిందని ఆయా పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
-
పసుపు బోర్డు సహా
గతేడాది అక్టోబర్ 3న ప్రధాని మోదీ నిజామాబాద్ గడ్డపై పసుపు బోర్టు ఏర్పాటు ప్రకటన చేశారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచార టైంలో హోంమంత్రి అమిత్‌షా మరోసారి బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సుమారు 35 వేల ఎకరాలలో రైతులు పసుపు సాగు చేస్తున్నారు. బోర్డు ఏర్పాటులో పసుపు రైతులకు మేలు జరగడమే కాకుండా అనుబంధ పరిశ్రమల స్థాపనతో యూత్‌కు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కేంద్ర బడ్జెట్‌లో బోర్డుకు ఎలాంటి ఫండ్స్ కేటాయించలేదు. నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా ఎక్కడా అనౌన్స్ చేయలేదు.
-
రైల్వే పై చిన్న చూపు
నిజామాబాద్ మీదుగా నిత్యం 42 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. సింగిల్ లైన్‌పై నడుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ముద్కెడ్ డబుల్ రైల్వే లైన్ ప్రతిపాదనలు చాలా కాలంగా ఉన్నాయి. బోధన్–-బీదర్, బోధన్-లాతూర్ కొత్త లైన్ కు బడ్జెట్ లో ఎలాంటి నిధులు ఇవ్వలేదు. వందే భారత్ రైలు మార్గం పొడిగింపు, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్ వరకు పొడిగించాలన్న ప్రతిపాదన ఊసేత్తలేదు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మోడరైజేషన్, నందిపేట్ సెజ్ ప్రస్తావన లేదు. నవీపేటలో ఆర్వోబీ నిర్మాణ అవసరాన్ని బడ్జెట్‌లో గుర్తించలేదు.
-
జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు తేలలే
జక్రాన్‌పల్లిలో ఎయిర్ పోర్టు నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి పార్లమెంట్లో లేవనెత్తిన జోరో అవర్ ప్రశ్నకు స్టేట్‌లో కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌తో పాటు జక్రాన్‌పల్లిలో గ్రీన్ఫీల్డ్ఎయిర్పోర్టుల నిర్మాణానికి రెడీగా ఉన్నట్లు ఆన్సర్ లభించింది. బడ్జెట్ లో వీటికి సంబంధించి నయాపైసా ఇవ్వలేదు.
-
ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే చిన్నచూపా..
కామారెడ్డి , వెలుగు: పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జేట్పై కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు పెదవి విరిచారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు దక్కింది శూన్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ విమర్శించారు. ఆంధ్ర, బిహార్ కు ప్రకటించిన దాంట్లో 25 శాతం కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవటం శోచనీయమన్నారు. స్టేట్ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మాత్రం చిన్నచూపు
చూసిందన్నారు.
-
వికసిత్ భారత్‌లో విద్యా రంగానికి ప్రయార్టీ లేదా..?
వికసిత్ భారత్‌లో విద్యా రంగానికి ప్రయార్టీ లేదని ఏపీటీఎఫ్ మాజీ స్టేట్ ప్రెసిడెంట్ కె. వేణుగోపాల్ విమర్శించారు. బడ్జెట్‌లో విద్యా రంగానికి కేవలం 2.59 శాతం మాత్రమే కేటాయించారని ఇది ఏ మాత్రం సరిపోదన్నారు. కనీసం 6 శాతం కేటాయించాల్సిన అవసరముండేదన్నారు. అరకొర కేటాయింపులతో వికసిత్ భారత్ ఎలా సాధ్యమవుతుందన్నారు. అంకెల గారడితో పన్ను భారం పెంచుతూ వేతన జీవులను మోసం చేస్తున్నారని టీపీటీఎఫ్ స్టేట్ మాజీ ప్రెసిడెంట్ కె.రమణ పేర్కొన్నారు.
-
ఎంతో ఆశించాం
ప్రధాని మోదీ ద్వారా రాష్ట్రానికి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చాలా నిధులు ఆశించామని ఇంత నిరాశపరుస్తారని అసలు ఊహాంచలేదని డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ఎన్నికల్లో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా నిధులు సాధించడంలో ఫెయిల్ అయ్యారన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మాటలు ఉత్తవే అయ్యాయన్నారు. కేంద్ర నుంచి స్టేట్‌కు మోసం జరిగిందని ఇంతటి చిన్నచూపు ఎప్పుడూ లేదన్నారు.
- మానాల మోహన్‌రెడ్డి, నిజామాబాద్ డీసీసీ ప్రెసిడెంట్