Union budget 2024: నిరుద్యోగుల కోసం పీఎం ప్యాకేజీ

Union budget 2024: నిరుద్యోగుల కోసం పీఎం ప్యాకేజీ

 

  • ఫస్ట్ టైమ్ ఉద్యోగంలో చేరేవారికి రూ.15వేలు
  • మూడు విడతల్లో నేరుగా ఖాతాల్లో డబ్బు జమ
  • ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకూ ప్రోత్సాహకాలు
  • రూ.3వేల వరకు ఈపీఎఫ్​వో కంట్రిబ్యూషన్ రీయింబర్స్​

న్యూఢిల్లీ:   యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త స్కీమ్​లను ప్రకటించింది. దేశంలో నిరుద్యోగులు పెరిగారన్న అపోజిషన్ పార్టీల విమర్శల నేపథ్యంలో ‘ప్రధాన్​ మంత్రి ప్యాకేజీ’ పేరుతో ఈ పథకాలను తీసుకొచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ స్కీమ్స్​ గురించి లోక్​సభలో వివరించారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్​లో ఎన్​రోల్​మెంట్ చేసుకున్న యువత, వేతనం ఆధారంగా ఈ స్కీమ్​ను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 

స్కీమ్ (బీ): మ్యానుఫాక్చరింగ్ రంగంలో ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఈ స్కీమ్​ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫస్ట్ టైమ్ ఎంప్లాయ్​తో పాటు జాబ్ అవకాశం ఇచ్చే మేనేజ్​మెంట్​కు కూడా ఇన్సెంటివ్ ప్రకటించింది. ఈపీఎఫ్​వో ఆధారంగానే ఈ స్కీమ్​ను అమలు చేయనున్నది. ఉద్యోగం కల్పించిన నాటినుంచి నాలుగేండ్ల వరకు ఈ ప్రోత్సాహకాలు అందుతాయి. దాదాపు 30 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నది.

స్కీమ్ (సీ): ఈ పథకం ద్వారా అన్ని రంగాల్లో అదనపు ఉపాధి లభిస్తుంది. అడిషనల్ జాబ్స్ కల్పించిన యాజమాన్యాలకు రెండేండ్ల పాటు రూ.3,000 వరకు ఈపీఎఫ్​వో కంట్రిబ్యూషన్​ను రీయింబర్స్ చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ పథకంతో 50లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా వేస్తున్నారు. నెలకు లక్ష రూపాయల్లోపు జీతం ఉన్న వారిని అడిషనల్ ఎంప్లాయ్​మెంట్ కింద లెక్కిస్తారు.

స్కీమ్​(ఏ): ఫస్ట్ టైమ్ ఉద్యోగంలో చేరే వారికి మొదటి నెల జీతం కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది. అన్ని సెక్టార్లలోని జాబ్​లకు ఇది వర్తిస్తుంది. హయ్యెస్ట్​గా ఒక్కొక్కరికి రూ.15వేలు అందజేస్తుంది. ఈ అమౌంట్ ను మూడు విడతల్లో సదరు వ్యక్తికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌‌‌ఫర్ స్కీమ్ కింద అతని ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా రానున్న ఐదేండ్లలో సుమారు రెండు కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరనున్నది. నెలకు గరిష్టంగా లక్ష రూపాయాల్లోపు జీతం ఉన్న వాళ్లు ఈ స్కీమ్​కు అర్హులు.

స్కిల్​ డెవలప్​మెంట్ కోసం రెండు స్కీమ్​లు

స్కీమ్ (ఏ): ‘ప్రధానమంత్రి స్కీమ్స్’ కింద యువతకు స్కిల్ డెవలప్​మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ రెండు స్కీమ్​లను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల సహకారంతో ముందుకువెళ్లనున్నది. వచ్చే ఐదేండ్లలో 20లక్షల మంది యువతకు స్కిల్ డెవలప్​మెంట్​లో ట్రైనింగ్ ఇవ్వనున్నది. వెయ్యి ఐటీఐలను హబ్ అండ్ స్పోక్ మోడల్ కింద అప్​గ్రేడ్ చేయనున్నది. ఇండస్ట్రీల అవసరాలకు అనుగుణంగా ఎడ్యుకేషన్​లో కొత్త కోర్సులు తేనుంది. 

స్కీమ్ (బీ): రాబోయే ఐదేండ్లలో కోటి మంది విద్యార్థులకు ఇంటర్న్​షిప్ అవకాశాలను అందించే పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఇంటర్న్​షిప్​లు దేశంలోని టాప్ 500 కంపెనీల్లో అందజేస్తారు. ప్రతి స్టూడెంట్​కు నెలకు రూ.5వేల ఇంటర్న్​షిప్​ అలవెన్స్ అందుతుంది. రూ.6వేల సాయంతో పాటు ఈ పథకంలో పాల్గొనే కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమాల నుంచి వచ్చే ఫండ్స్​ను ఉపయోగించి శిక్షణ ఖర్చులు, పది శాతం ఇంటర్న్​షిప్​ ఖర్చులను భరిస్తాయని కేంద్రం తెలిపింది.