బడ్జెట్ అంటే ప్రభుత్వ వార్షిక విత్త ప్రణాళిక. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసే విధానాలను సూచిస్తుంది. బడ్జెట్ రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ రసీదులు, చెల్లింపులు సంబంధిత పరిమాణాత్మక విలువలను తెలియజేస్తుంది. వచ్చే సంవత్సరంలో చేపట్టాల్సిన పథకాలు, వ్యూహాలను సూచిస్తుంది. కేంద్ర ప్రభుత్వ రాబడి, వ్యయాలు, రుణాలు, పలురకాల లోట్లు, ఇతర ద్రవ్య ప్రవాహాలను ప్రదర్శించే పట్టికనే వార్షిక బడ్జెట్ అంటారు. ఇది ప్రభుత్వ వార్షిక ప్రణాళిక అంశాలను, విధానాలను తెలుపుతుంది. బడ్జెట్లో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అంచనా వేసిన రాబడులు, అంచనా వేసిన వ్యయం.
అంచనా రాబడులు: ఇవి అన్ని మార్గాల నుంచి ప్రభుత్వం వచ్చే సంవత్సరంలో వసూలు చేయాలని అంచనా వేసిన రాబడులు. ప్రస్తుత సంవత్సరం ప్రభుత్వం వసూలు చేసిన పలు రకాల పన్నుల రాబడి ఆధారంగా వచ్చే సంవత్సర రాబడి అంచనాలు తయారు చేస్తారు. అంటే ఈ రాబడి విషయాలన్ని భారతదేశ పన్ను విధానానికి సంబంధించినవి.
అంచనా వ్యయం: ఇది వచ్చే సంవత్సరంలో ప్రభుత్వ ప్రణాళిక, పథకాల అమలుపై చేయడానికి అంచనా వేసిన ఖర్చు. ప్రస్తుత సంవత్సరం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలపై చేసిన ఖర్చు ఆధారంగా వచ్చే సంవత్సర వ్యయ అంచనాలు తయారు చేస్తారు. ఈ వ్యయం వివరాలన్నీ దేశ వ్యయ విధానానికి సంబంధించినవి.
బడ్జెట్లోని భాగాలు: రాజ్యాంగం ప్రకారం రెవెన్యూ వ్యయ ఖాతాను ఇతర ఖాతాల నుంచి వేరుగా చూపించాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను రెండు ఖాతాలుగా వర్గీకరించారు. అవి. 1. రెవెన్యూ ఖాతా 2. మూలధన ఖాతా
రెవెన్యూ బడ్జెట్/ ఖాతా: ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరిగే ప్రభుత్వ లావాదేవీలు అన్ని రెవెన్యూ బడ్జెట్లో చూపిస్తారు. రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయాలు భాగాలుగా ఉంటాయి.
రెవెన్యూ రాబడులు/ రసీదులు: పన్ను రాబడి, పన్నేతర రాబడుల మొత్తాన్ని రెవెన్యూ రాబడి అంటారు. వీటిలో పన్నుల నుంచి అధిక రాబడి వస్తుంది.
పన్నుల రాబడి: కేంద్ర ప్రభుత్వం విధించే అన్ని పనులు, సుంకాల నుంచి లభించే రాబడిని పన్నుల రాబడి అంటారు. ప్రభుత్వానికి రాబడి సమకూర్చే పన్నుల్లో ముఖ్యమైనవి. 1.కార్పొరేషన్ పన్ను 2. ఆదాయం పన్ను 3. ఎగుమతి, దిగుమతి సుంకం 4. ఎక్సైజ్ సుంకం 5. జీఎస్టీ 6. కేంద్రపాలిత ప్రాంత పన్నులు.
పన్నేతర రాబడి: కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా ల భించే వాటిని పన్నేతర రాబడి అంటారు. పన్నేతర రాబడులు లభించే మార్గాల్లో ముఖ్యమైనవి. ఇందులో 1. ప్రభుత్వరంగ సంస్థల లాభాలు, డివిడెండ్లు 2. ప్రభుత్వానికొచ్చే వడ్డీలు 3. వాణిజ్యపర లాభాలు 4. ప్రభుత్వ సేవలు 5. బహిర్గత గ్రాంట్లు 6. ఇతర పన్నేతర రాబడి మొదలైనవి భాగాలు.
రెవెన్యూ వ్యయం: ప్రతి ఏటా క్రమం తప్పకుండా ప్రభుత్వం చేసే వ్యయం రెవెన్యూ వ్యయం. ఇది ప్రభుత్వ యంత్రాంగం నడపడానికి చేసే వ్యయం. ఇందులో 1. రుణాలపై వడ్డీ చెల్లింపులు 2. సబ్సిడీలు 3. రక్షణ వ్యయం మొదలైనవి భాగాలు. రెవెన్యూ వ్యయం వల్ల దేశంలో ఎలాంటి ఆస్తులు సృష్టి ఉండదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే విరాళాలు కూడా రెవెన్యూ వ్యయంగానే పరిగణించాలి. వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, రక్షణ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకిచ్చే గ్రాంట్లు, పింఛన్లు, పోలీస్, జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి అందించే వ్యయం, ఆర్థిక సేవలు(వ్యవసాయం, పరిశ్రమలు, శక్తి, రవాణా), సాధారణ సేవలు(పన్ను వసూళ్లు, విదేశీ వ్యవహారాలు), సాంఘిక సేవలు(విద్య, ఆరోగ్యం, ప్రచారం), పోస్టల్ డెఫిసిట్, విదేశాలకిచ్చే గ్రాంట్లు,రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని రెవెన్యూ లోటుగా వర్ణిస్తారు.
మూలధన బడ్జెట్/ ఖాతా: కేంద్ర ప్రభుత్వం చేసే వ్యయం, లావాదేవీలు ఆస్తులు సృష్టించడానికి ఉపయోగపడితే దాన్ని మూలధన బడ్జెట్ అంటారు. దేశంలో ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణాలు దీని కిందకు వస్తాయి. ఇందులో రెండు భాగాలుంటాయి. అవి.. మూలధన రాబడి, మూలధన వ్యయం.కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాల నుంచి సేకరించిన రుణాల మొత్తం మూలధన రాబడిగా చెప్పవచ్చు. ఇందులో మార్కెట్ నుంచి తీసుకొనే రుణాలు, రుణేతర రాబడులు ఉంటాయి.
మూలధన వ్యయం: ప్రభుత్వ ఆస్తులను సృష్టించి, వాటి నుంచి ఆదాయాన్ని కల్పించడానికి చేసే వ్యయం మూలధన వ్యయం అంటారు. జాతీయ ప్రాజెక్టులు, పరిశ్రమపై చేసే వ్యయం ఈ వర్గానికి చెందుతాయి. 1. భూమి, భవనాలు, యంత్ర పరికరాలు, షేర్లలో పెట్టుబడి వ్యయం. 2. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, ప్రభుత్వ కంపెనీలకు – కార్పొరేషన్లకు విదేశీ ప్రభుత్వాలకు ఇచ్చే రుణాలు 3. రక్షణ మూలధన వ్యయం ఇందులో భాగాలుగా ఉంటాయి.
దేశ బడ్జెట్ వచ్చే సంవత్సరానికి అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వ రాబడులు, చెల్లింపులను మూడు ఖాతాలుగా చూపుతుంది. అవి.. సంఘటిత నిధి, అగంతుక నిధి,
ప్రభుత్వ ఖాతా.
సంఘటిత నిధి: ఆర్టికల్ 266 ప్రకారం పన్నులు, సుంకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై లభించే రాబడితో సహా అన్ని రకాల ప్రభుత్వ రాబడులు, ప్రభుత్వం తీసుకున్న రుణాలు ఈ నిధికి జమ చేస్తారు. ప్రభుత్వం ఖర్చు నిమిత్తం డబ్బు తీసుకోవాలంటే పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. సంఘటిత నిధికి చెందిన ఈ భాగాన్నే సాధారణ బడ్జెట్ అంటారు. అలాగే రాష్ట్ర రాబడులన్నీ రాష్ట్ర సంఘటిత నిధికి జమ అవుతాయి.
కంటింజెన్సీ ఫండ్ అకౌంట్: పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు కొన్ని అత్యవసర సమయాల్లో ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుంది. తుపాన్లు, వరదలు, భూకంపాల సమయాల్లో పార్లమెంట్ ఆమోదం తర్వాత పొందవచ్చని రాష్ట్రపతి ఆధీనంలోని కంటింజెన్సీ నిధి నుంచి ప్రభుత్వం ఖర్చు చేయవచ్చు. అయితే, ఆ తర్వాత పార్లమెంట్ ఆమోదం తప్పక పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం కంటింజెన్సీ నిధి నుంచి వాడుకున్న మొత్తాన్ని తిరిగి కంటింజెన్సీ నిధిలో జమ చేయాలి.
పబ్లిక్ అకౌంట్/ ప్రభుత్వ ఖాతా: ఉద్యోగుల(ప్రావిడెంట్ ఫండ్) భవిష్య నిధి, చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు సేకరణ, ఇతర డిపాజిట్లు ముఖ్యమైనవి. చిన్న మొత్తాల పొదుపు, పీఎఫ్, తపాలా, జీవిత బీమా మొదలైన వాటి ద్వారా వసూలైన మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. ఈ మార్గాల ద్వారా ప్రభుత్వ ఖాతాలో చేరిన మొత్తం ప్రభుత్వ రాబడి కాదు. ఏదో ఒక సమయంలో ఈ మొత్తాన్ని వారికి ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.