జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ .. కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం

జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ .. కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం
 
  • శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే చాన్స్!
  • దేశవ్యాప్తంగా లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి 
  • ఆ తర్వాత వంద రోజుల్లోపే స్థానిక సంస్థలకు ఎలక్షన్లు
  • డబ్బు, టైమ్ ఆదా అవుతుందన్న కమిటీ
  • 18 రాజ్యాంగ సవరణలకు సిఫార్సు
  • వన్ నేషన్ – వన్ ఎలక్షన్​ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు
  • ఆచరణలో సాధ్యం కాదంటున్న 15 పార్టీలు
  • పార్లమెంట్​లో బిల్లును అడ్డుకుంటామని హెచ్చరిక

న్యూఢిల్లీ, వెలుగు: వన్‌‌ నేషన్‌‌ – వన్‌‌ ఎలక్షన్‌‌’ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌‌నాథ్‌‌ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. వచ్చే పార్లమెంట్‌‌ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం మంత్రి వర్గం భేటీ అయింది. 

ఈ సందర్భంగా జమిలి ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కాగా, రామ్​నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు జడ్జిలతో సహా 32 రాజకీయ పార్టీల ప్రతినిధులు సమర్థించారు. జమిలి ఎన్నికల నిర్వహణ కోసం 18 రాజ్యాంగ సవరణలను ఈ హైలెవల్ కమిటీ సిఫార్సు చేసింది. కాగా, వన్ నేషన్–వన్ ఎలక్షన్​ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

పార్లమెంట్​లో బిల్లును అడ్డుకుంటామని 15 అపోజిషన్ పార్టీలు హెచ్చరించాయి.కమిటీ చేసిన సిఫార్సులేంటి?జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ నేతృ త్వంలో ప్రధాని మోదీ హైలెవల్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలోని సభ్యులంతా.. రాజకీయ పార్టీలు, మేధావులు, న్యాయ నిపుణులతో చర్చించారు. పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసి ఇటీవలే కేంద్రానికి అందజేశారు. లోక్‌‌‌‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగిన వంద రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. 

లోక్‌‌‌‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించడంతో వలస కార్మికులు పలుమార్లు ఓటేయడం కోసం సెలవులపై తమ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నదని, దీంతో ఉత్పత్తిలో అంతరాయం కలుగుతున్నదని కమిటీ వెల్లడించింది. దాన్ని నివారించాలంటే జమిలి ఎన్నికలే ఏకైక మార్గమని పేర్కొన్నది. ఎన్నికల ఖర్చు, టైమ్ సేవ్ అవుతుందని తెలిపింది. మొదటి దశలో లోక్​సభ, అసెంబ్లీలకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్​లో సవరణలకు ఆమోదం లభిస్తే రాష్ట్రాల పర్మిషన్ అవసరం ఉండదు. రెండో దశలో వంద రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆర్టికల్ 83, అసెంబ్లీ పదవీకాలానికి సంబంధించి ఆర్టికల్ 172ను సవరించాల్సి ఉంటదని కమిటీ సిఫార్సు చేసింది. 

2029 ఎన్నికలకు రోడ్ మ్యాప్

2029లో ఏకకాల ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పటి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటది. లోక్​సభలో ప్రవేశపెట్టే బిల్లుకు ఆమోదం లభిస్తే ఏకకాల ఎన్నికల కోసం అసెంబ్లీలను 2029కల్లా పదవీ కాలాన్ని ముగించుకోవాల్సి ఉంటది. దీంతో పలు రాష్ట్రాల అసెంబ్లీలు ముందే రద్దు అవుతాయి. నిరుడు 10 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇందులో తెలంగాణ, హిమాచల్, మేఘాలయ, నాగాలాండ్, కర్నాటక, త్రిపుర, మిజోరాం, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్, రాజస్థాన్ ఉన్నాయి. వీటి పదవీకాలం 2028తో ముగుస్తది. 

తర్వాత ఏర్పడే ప్రభుత్వాలన్నీ ఏడాది లేదంటే అంతకంటే తక్కువ టైం మాత్రమే అధికారంలో ఉంటాయి. యూపీ, పంజాబ్, గుజరాత్​లో 2027లో ఎన్నికలు జరగనున్నాయి. అంటే.. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వం రెండేండ్లు మాత్రమే ఉంటది. బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళలో 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ఎన్నికలు జరిగిన ఏపీ, అరుణాచల్​ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానాలు మాత్రమే 2029 నాటికి జమిలి ఎన్నికలతో కలిసి రానున్నాయి. 

ఇప్పటిదాకా నాలుగు సార్లు ఏకకాల ఎన్నికలు

స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన తొలి నాలుగు సాధారణ ఎన్నికల్లో (1951–52, 1957, 1962, 1967) దేశ ప్రజలంతా ఏక కాలంలో లోక్ సభ, అసెంబ్లీలకు ఓటేశారు. తర్వాత కొత్త రాష్ట్రాల ఏర్పాటు, పలు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కారణంగా ఏకకాల ఎన్నిలకు బ్రేక్ పడింది. 1968–89 మధ్య పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలు రద్దు కావడంతో దేశంలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కు పూర్తిగా ఫుల్​స్టాప్ పడింది. కాగా, ఏకకాల ఎన్నికలను పునరుద్ధరించాలని 1983లో కేంద్ర ఎన్నికల సంఘం తన వార్షిక నివేదికలో కోరింది. 

ముందే చెప్పిన మోదీ, అమిత్ షా

కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ వంద రోజుల పాలనపై మంగళవారం మీడియాతో మాట్లాడిన అమిత్ షా.. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై క్లూ ఇచ్చారు. మోదీ నేతృత్వంలోని ఈ టర్మ్ సర్కార్​లోనే జమిలి ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తామని నొక్కి చెప్పారు. గత మూడు లోక్​సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోనూ ఈ విషయాన్ని గుర్తు చేశారు. 

అలాగే, పంద్రాగస్టు రోజున ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం కేవలం వన్ నేషన్–వన్ ఎలక్షన్ అని చెప్పారు. ఆ దిశగా అన్ని రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

ఎవరెవరు జమిలి ఎన్నికలకు సిఫార్సు చేశారు?

వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని హై లెవల్ కమిటీ ప్రధానంగా ఆరు సిఫార్సులు చేసింది. ఇందులో 1951–1967 మధ్య ఏక కాలంలో ఎన్నికలు జరిగాయని గుర్తు చేసింది. 1999లో జరిగిన 179వ రిపోర్ట్ లో లా కమిషన్ ఐదేండ్లలో లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని సూచించినట్లు తెలిపింది. 2015 పార్లమెంటరీ కమిటీ 79 నివేదికలో... రెండు దశల్లో ఏక కాల ఎన్నికలకు సంబంధించిన సిఫార్సులు చేసిందని చెప్పింది. ప్రస్తుతం ఈ హైలెవల్ కమిటీ రాజకీయ పార్టీలు, భాగస్వాములు, నిపుణులు, మేధావులతో చర్చించి ఏకకాల ఎన్నికలకు మొగ్గుచూపినట్లు వెల్లడించింది. నివేదిక ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అందుబాటులో ఉందని, దేశంలో ఏకకాల ఎన్నికలకు విస్తృతమైన మద్దతు ఉందని వివరించింది.

ఎరువులకు 24 వేల కోట్ల సబ్సిడీ

  • ఎరువులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2024–25 రబీ సీజన్​లో రైతులకు తక్కువ ధరకు పీ అండ్ కే ఎరువులు అందించాలని నిర్ణయించింది. ఇందుకు రూ.24,474 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది.
  • ఇస్రో తలపెట్టిన చంద్రయాన్ 4 మూన్ మిషన్ కు కేబినెట్ ఓకే చెప్పింది. చంద్రునిపై సక్సెస్ ఫుల్ గా ల్యాండింగ్ తర్వాత భూమికి పైకి తిరిగి వచ్చేలా టెక్నాలజీ డెవలప్ మెంట్ చేస్తున్నారు. అక్కడి మట్టి నమూనాలను భూమికి తీసుకురావడమే మిషన్ ప్రధాన లక్ష్యం. దీని కోసం రూ.2,104.06 కోట్లు కేటాయించింది. అన్ని ఆమోదాలు పొందిన 36 నెలల్లోనే చంద్రయాన్ 4 మిషన్ చేపట్టనున్నారు. 
  • ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం ఆశా) కోసం రూ.35 వేల కోట్లను కేబినెట్ ఆమోదించింది.
  • వీనస్‌‌‌‌ మిషన్‌‌‌‌, గగన్‌‌‌‌యాన్‌‌‌‌, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్​జీఎల్​వీ) డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రాజెక్టులకు సైతం కేంద్రం గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చింది. ఎన్​జీఎల్​వీ కోసం రూ.8,240 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది.
  • ప్రధాన మంత్రి జన్​జాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ కింద గిరిజన సంక్షేమానికి రూ.79,156 కోట్ల పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
  • యానిమేషన్ ఎకో సిస్టమ్​ను బూస్ట్ ఇచ్చేందుకు ఐఐటీలు, ఐఐఎంల తరహాలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ అండ్ ఎక్స్​టెండెడ్ రియాలిటీ కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​(ఎన్​సీఓఈ)ని ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది.

వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అంటే?

‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ అంటే దేశంలోని ఓటర్లు అందరూ లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకేసారి ఓటు హక్కును వినియోగించుకోవడం. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఒకే టైమ్​లో కాకపోయినా... ఒకే ఏడాదిలో  ప్రజలు ఓటేస్తారు. ఇటీవల ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ, లోక్​సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. 

బుధవారం జమ్మూ కాశ్మీర్​లో ఎన్నికలు జరిగాయి. వచ్చే నెలలో హర్యానా, ఏడాది చివర్లో జార్ఖండ్, మహారాష్ట్రలోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు. మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాలు వేర్వేరుగా ఉన్నాయి. కేంద్ర కేబినెట్ ఆమోదించిన 
వన్ నేషన్‌‌- వన్ ఎలక్షన్ ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చితే దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత వంద రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేస్తారు.