రైతులకు మోడీ సర్కార్ భారీ గుడ్ న్యూస్

రైతులకు మోడీ సర్కార్ భారీ గుడ్ న్యూస్
  • వ్యవసాయం, అనుబంధ రంగాలకు
  • రూ.14 వేల కోట్లతో 7 స్కీమ్​లు
  • ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం 
  • రూ. 2,817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ 
  • రూ. 3,979 కోట్లతో క్రాప్ సైన్స్ ప్రోగ్రాంకు ఆమోదం 
  • ముంబై, ఇండోర్ మధ్య 309 కి.మీ. రైల్వే లైన్ 
  • గుజరాత్​లో సెమీ కండక్టర్ల ప్లాంటు ఏర్పాటుకు ఓకే

న్యూఢిల్లీ: వ్యవసాయం, దాని అనుబంధ రంగాల సమగ్ర అభివృద్ధి కోసం రూ. 13,966 కోట్లతో 7 కొత్త పథకాలను అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. రూ. 2,817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ప్రారంభించేందుకు, రూ. 3,979 కోట్లతో క్రాప్ సైన్స్ ప్రోగ్రాం చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. సోమవారం ప్రధాని నేతృత్వంలో కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ పథకాలను అమలు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

 కేవలం 20 నిమిషాల్లోనే రైతులకు రుణాలు అందించేలా డిజిటల్ అగ్రి మిషన్‎లో భాగంగా అగ్రి స్టాక్, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్‎ను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ‘‘ఆహార, పోషక భద్రత కార్యక్రమాల కోసం క్రాప్ సైన్స్ ప్రోగ్రాంను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో రీసెర్చ్, ఎడ్యుకేషన్‎తో పాటు జన్యు వనరుల నిర్వహణ, పప్పులు, నూనె గింజల పంటల అభివృద్ధి, కీటకాలు, పాలినేటర్స్​పై పరిశోధన వంటి ఆరు కార్యక్రమాలు ఉంటాయి” అని కేంద్రమంత్రి తెలిపారు. 

ఐసీఏఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయ విద్య, మేనేజ్మెంట్, సోషల్ సైన్సెస్ బలోపేతం కోసం రూ. 2,291 కోట్లతో మరో పథకాన్ని కూడా అమలు చేయనున్నట్టు చెప్పారు. అలాగే పాడి పశువుల ఆరోగ్యం మెరుగుదల, పశు సంపద పెంపుదల కోసం రూ. 1,702 కోట్లతో మరో స్కీంను చేపట్టనున్నట్టు వెల్లడించారు. వీటితోపాటు హార్టికల్చర్ అభివృద్ధి కోసం రూ.860 కోట్లు, కృషి విజ్ఞాన్ కేంద్రాల బలోపేతం కోసం రూ. 1,202 కోట్లు, సహజ వనరుల నిర్వహణకు రూ. 1,115 కోట్లతో మరో 3 కార్యక్రమాలను కూడా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు.

ముంబై, ఇండోర్ మధ్య 309 కి.మీ. రైల్వే లైన్  

దేశంలోని రెండు ప్రధాన వాణిజ్య నగరాలైన ముంబై (మహారాష్ట్ర), ఇండోర్ (మధ్యప్రదేశ్) మధ్య రైలు మార్గం దూరాన్ని తగ్గించేందుకు గాను 309 కిలోమీటర్ల మేరకు కొత్త రైల్వే లైన్‎ను నిర్మించాలని ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ నిర్ణయించిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద రూ. 18,036 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు 2028-,29 నాటికి పూర్తవుతుందన్నారు. రైల్వే లైన్ నిర్మాణ సమయంలో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‎లోని ఆరు జిల్లాల్లో నిర్మించనున్న ఈ కొత్త రైల్వే లైన్ తో టూరిజం, వాణిజ్యం గణనీయంగా పెరుగుతుందన్నారు.