కేదార్​నాథ్​లో రెండు రోప్​వేలు.. ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినకేంద్ర కేబినెట్

కేదార్​నాథ్​లో రెండు రోప్​వేలు.. ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినకేంద్ర కేబినెట్

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్​లోని సోన్ ప్రయాగ్ – కేదార్ నాథ్, గోవింద్​ఘాట్ – హేమకుండ్ రోప్ వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.6,811 కోట్లు ఖర్చు చేయనున్నది. రోప్ వే ప్రాజెక్టులు కంప్లీట్ అయితే.. చార్​ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. పర్యాటకరంగ అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రివర్గం బుధవారం భేటీ అయింది. ఈమేరకు కొన్ని కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ‘‘సోన్ ప్రయాగ్ – కేదార్ నాథ్, గోవింద్​ఘాట్ – హేమకుండ్ రోప్ వే ప్రాజెక్టులను రానున్న 4 నుంచి 6 ఏండ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నేషనల్ రోప్ వేస్ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్ – పర్వతమాల పరియోజన కింద వీటిని నిర్మిస్తున్నాం. సోన్ ప్రయాగ్ – కేదార్​నాథ్ రోప్ వే మధ్య దూరం 12.9 కిలో మీటర్లు ఉంది. 

రోప్ వే ప్రాజెక్ట్​ను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్​షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తాం. దీని కోసం రూ.4,081 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అత్యంత అధునాతన ట్రై -కేబుల్ డిటాచబుల్ గొండోలా (3ఎస్) టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నాం. ఒక డైరెక్షన్​లో ఒకేసారి 1,800 మందిని తీసుకెళ్లే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుంది. రోజుకు సుమారు 18వేల మంది యాత్రికులు ప్రయాణించొచ్చు. 9 గంటల జర్నీ.. 36 నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చు’’ అని ఆయన తెలిపారు.

రైతుల కోసం ఎల్​హెచ్​డీసీ ప్రోగ్రామ్​

రైతుల వద్ద ఉన్న పశు సంపదను కాపాడేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘లైవ్​స్టాక్స్ హెల్త్ అండ్ డిసీస్ కంట్రోల్ ప్రోగ్రామ్’(ఎల్​హెచ్​డీసీపీ) కు రూ.3,880 కోట్లు కేటాయించినట్లు వివరించారు. పశువులకు మెరుగైన వైద్యంతో పాటు హై క్వాలిటీ మెడిసిన్స్ అందించేందుకు కేబినెట్ నిర్ణయించిందన్నారు. ‘‘ఎల్​హెచ్​డీసీపీ కింద పశువులకు వ్యాక్సిన్లు వేస్తారు. పశు ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాం. ఈ ప్రోగ్రామ్ కోసం కేటాయించిన మొత్తం బడ్జెట్ నుంచి రూ.75 కోట్లను క్వాలిటీ మెడిసిన్స్ కోసం అందజేస్తాం’’అని ఆయన తెలిపారు.