
పార్లమెంటరీ ప్యానెల్ రిపోర్టు ఆధారంగా వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రిపోర్టు ఆధారంగా వక్ఫ్ సవరణ బిల్లుకు ఫిబ్రవరి 19న జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు తెలుస్తోంది.
2025 బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో పార్లమెంటులో ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య ఈ నివేదికను లోక్‌సభ ,రాజ్యసభ రెండింటిలోనూ ప్రవేశపెట్టారు. దీని ఫలితంగా ఉభయ సభలలో కార్యకలాపాలు కొద్దిసేపు వాయిదా పడ్డాయి.జేపీసీ రిపోర్టులనుంచి కొన్ని తొలగించారని ప్రతిపక్ష ఎంపీలు చెప్పారు. కానీ కేంద్రం ఆ ఆరోపణను తోసిపుచ్చింది.
గత వారమే కేంద్ర మంత్రివర్గం జేపీసీ రిపోర్టును ఆమోదించిందని, మార్చి 10న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల రెండవ భాగంలో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను క్రమబద్ధీకరణ బిల్లుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
బిజెపి నేత జగదాంబికా పాల్ నేతృత్వంలోని జేపీసీ.. ప్రతిపక్షాల భిన్నాభిప్రాయాల మధ్య చట్టానికి అనేక సవరణలను సూచించింది. అయితే జనవరిలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సభ్యులు ప్రతిపాదించిన వక్ఫ్ బిల్లుకు చేసిన అన్ని సవరణలను పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది.
అయితే క్లాజుల వారీగా చర్చలో ప్రతిపక్ష సభ్యులు సూచించిన ప్రతి మార్పును తిరస్కరించింది. ప్రతిపాదించబడిన 44 సవరణలలో 14 నిబంధనలకు మార్పులను NDA సభ్యులు సూచించారు, వీటన్నింటినీ ఓటింగ్ తర్వాత ప్యానెల్ ఆమోదించింది.