
న్యూఢిల్లీ:వక్ఫ్ (సవరణ) బిల్లు 2024ను పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సూచించిన సిఫార్సులకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చర్చించే అవకాశాలున్నాయి. ఈ మేరకు జేపీసీ మొత్తం 14 సిఫార్సులు చేసినట్లు తెలిసింది.
అదేవిధంగా, కేంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డులను నియంత్రించే చట్టాల్లో 44 మార్పులను కూడా జేపీసీ ప్రతిపాదించింది. కాగా, వక్ఫ్ బోర్డు (సవరణ) బిల్లు నివేదికను ఈ నెల 13న పార్లమెంట్లో జేపీసీ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 19వ తేదీన జరిగిన కేబినెట్ భేటీలోనే జేపీసీ చేసిన సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదించినట్లు సమాచారం.
కాగా, జగదాంబిక పాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన జేపీసీ.. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం, వివాదాలపై విచారణల వంటి వాటిలో మార్పులు సూచించింది.