కేదార్ నాథ్ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. సోన్ ప్రయాగ్-కేదార్ నాథ్ రోప్ వే ప్రాజెక్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేదార్ నాథ్ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. సోన్ ప్రయాగ్-కేదార్ నాథ్ రోప్ వే ప్రాజెక్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: కేదార్ నాథ్ వేళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సోన్ ప్రయాగ్-కేదార్ నాథ్, హేమకుండ్ సాహిబ్ రోప్ వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం (మార్చి 5) జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ రెండు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ మేరకు కేబినెట్ భేటీ వివరాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణమ్ మీడియాకు వెల్లడించారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కేదార్‌నాథ్, హేమకుండ్ సాహిబ్ అనే రెండు రోప్‌వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. 

జాతీయ రోప్‌వేస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ -పర్వతమాల పరియోజన కింద ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ వరకు 12.9 కి.మీ పొడవైన రోప్‌వే ప్రాజెక్ట్ అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.4,081 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సోన్ మార్గ్ కేదార్ నాథ్ రోప్ వే ప్రాజెక్ట్ పూర్తి అయితే.. కేదార్ నాథ్ చేరుకునేందుకు సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సోన్ మార్గ్ నుంచి కేదార్ నాథ్ వెళ్లడానికి  8 నుంచి 9 గంటల సమయం పడుతుండగా.. అదే ఈ రోప్ వే ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే కేవలం 36 నిమిషాల్లో కేదార్ నాథ్ చేరుకోవచ్చని తెలిపారు. 

ఆస్ట్రియా, ఫ్రాన్స్ నిపుణుల సహాయంతో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నారు. అలాగే.. హేమకుండ్ సాహిబ్ రోప్ వే ప్రాజెక్టు కూడా కేంద్రం ఆమోద ముద్ర వేసిందని చెప్పారు అశ్వినీ వైష్ణవ్. 12.4 కి.మీ. పొడవైన ఈ రోప్ వే ప్రాజెక్టు హేమకుండ్ సాహిబ్‌ను గోవింద్ ఘాట్‌తో కలుపుతుందని.. ఈ ప్రాజెక్టుకు రూ.2,730.13 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జాతీయ రోప్‌వేస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ - పర్వతమాల పరియోజనలో భాగంగా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేపట్టామని అన్నారు.