గుడ్ న్యూస్: కేంద్ర ఉద్యోగులకు డీఏ 2 శాతం పెంపు

గుడ్ న్యూస్: కేంద్ర ఉద్యోగులకు  డీఏ 2 శాతం పెంపు
  • 1.5 కోట్ల మంది ఉద్యోగ, పెన్షనర్లకు లబ్ధి: కేబినెట్ నిర్ణయం
  • ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ ఉత్పత్తికి రూ.23 వేల కోట్లతో పీఎల్ఐ స్కీమ్​
  • కొత్తగా 90 వేల మందికి ఉపాధి లభించే అవకాశం
  • పొటాష్​, ఫాస్ఫేట్​ఎరువులపై రూ.37 వేల కోట్ల సబ్సిడీ
  • బిహార్​లో రూ.3,700 కోట్లతో పాట్నా-ససారాం కారిడార్ ప్రాజెక్టు
  • కోసీ-మోచీ ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్టుకు రూ. 3,652.56 కోట్లు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే డీఏ(డియర్నెస్ అలవెన్స్), పెన్షనర్లకు చెల్లించే డీఆర్(డియర్​నెస్​ రిలీఫ్) 2 శాతం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్​మీడియాకు వెల్లడించారు. డీఏ పెంపు నిర్ణయంతో దేశంలోని మొత్తం 48.66 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 66.55 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని చెప్పారు. ఉద్యోగుల డీఏ, పెన్షనర్ల డీఆర్  ప్రస్తుతం ఉన్న 53 శాతం నుంచి 55 శాతానికి పెరుగుతుందని.. ఇది2025 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై జీతాలు, వేతనాలు, పెన్షన్ల చెల్లింపు భారం ఏటా అదనంగా రూ.6,614.06 కోట్లు పడుతుందన్నారు. ప్రస్తుతం 7వ పే కమిషన్ అమలులో ఉండగా.. కొన్ని రోజుల కిందట ప్రధాని మోదీ 8వ పే కమిషన్​ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఎంత జీతం పెరుగుతుంది..? 

ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం రూ.50 వేలు ఉంటే.. అందులో ఇప్పటి వరకు ఉన్న డీఏ 53 శాతం రూ.26,500 ఉంటుంది. ప్రస్తుతం 2శాతం డీఏ పెంచిన నేపథ్యంలో అది 55 శాతానికి చేరుతుంది. ఈ కొత్త డీఏ మొత్తం రూ.27,500 అవుతుంది. అంటే సదరు ఉద్యోగి మూల వేతనం రూ.1,000 పెరుగుతుంది.

దేశీయంగా ఎలక్ట్రానిక్​ పరికరాల ఉత్పత్తి 

పాసివ్ లేదా నాన్- సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ల ఉత్పత్తి పెంపు కోసం దాదాపు రూ.23 వేల కోట్లతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్​(పీఎల్ఐ) స్కీమ్​ను తీసుకొస్తున్నట్టు అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు. ఇది పాసివ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్‌‌‌‌ల తయారీని ప్రోత్సహించడంపై దృష్టి సారించిన మొదటి పథకమని పేర్కొన్నారు. దిగుమతులు తగ్గించి స్వదేశీ ఎలక్ట్రానిక్​ పరికరాల ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా దీన్ని తీసుకొస్తున్నామన్నారు. దేశీయంగా బ్యాటరీలు, డిస్ ప్లేలు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు( పీసీబీ), కెమెరా మాడ్యుల్స్ వంటి కీలకమైన ఎలక్ట్రానిక్ భాగాల ఉత్పత్తిని పెంచుతుందన్నారు. టెలికాం, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, హెల్త్, ఎలక్ట్రిక్ తదితర రంగాల అవసరాలను తీర్చుతుందన్నారు. ఈ పథకం రూ.4.56 లక్షల కోట్ల ప్రొడక్షన్ కు దారులు వేస్తుందని తెలిపారు. 90 వేల మందికి పైగా ఉపాధి పొందుతారని చెప్పారు.

రైతులకు తక్కువ ధరలకు ఎరువులు

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌‌‌‌కు పోటాష్​, ఫాస్ఫేటిక్ ఎరువులపై రూ.37,216 కోట్ల సబ్సిడీని ఇవ్వనున్నట్టు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. రైతులకు తక్కువ ధరలకే నేల, పంటలకు పోషకాలను అందిచే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. 2025 ఖరీఫ్ సీజన్‌‌‌‌కు (2025 ఏప్రిల్ 1 నుంచి 2025 సెప్టెంబర్ 30 వరకు) పోటాష్​, ఫాస్ఫేటిక్ ఎరువులపై పోషక ఆధారిత సబ్సిడీ (ఎన్​బీఎస్) రేట్లను నిర్ణయించే ప్రతిపాదనను ఆమోదించినట్టు చెప్పారు. డీఏపీ(డై-అమ్మోనియం ఫాస్ఫేట్) రిటైల్ ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతాయని పేర్కొన్నారు.

పాట్నా–ససారాం మధ్య 120 కిలోమీటర్ల కారిడార్​ 

కేంద్ర కేబినెల్ బీహార్‌‌‌‌ కు భారీ ఆర్థిక సాయాన్ని ఆమోదించింది. వివిధ ప్రాజెక్టులకు వేల కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్టు ప్రకటించింది. రూ.3,712.40 కోట్ల అంచనా వ్యయంతో 120.10 కిలోమీటర్ల నాలుగు లేన్ల గ్రీన్​ఫీల్డ్, బ్రౌన్​ఫీల్డ్ పాట్నా– ససారాం కారిడార్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్​)లో నిర్మిస్తారు. ప్రస్తుతం ససారాం, అర్రా, పాట్నా మధ్య రాష్ట్ర రహదారులతో కనెక్టివిటీ ఉంది. 

కోసి–మెచి లింక్ ప్రాజెక్ట్‌‌‌‌కు ఆమోదం

ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన- యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ (పీఎంకేఎస్​వైఏఐబీపీ)లో బీహార్‌‌‌‌లోని కోసి–మెచి ఇంట్రా-స్టేట్ లింక్ ప్రాజెక్ట్‌‌‌‌ను చేర్చేందుకు కేంద్ర కేబినెట్​ ఆమోదించింది. రూ.6,282.32 కోట్ల అంచనా వ్యయం గల ఈ ప్రాజెక్టును 2029 మార్చి వరకు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం బీహార్‌‌‌‌కు రూ. 3,652.56 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా కోసి మిగులు జలాల్లో కొంత భాగాన్ని బీహార్‌‌‌‌లోని మహానంద బేసిన్‌‌‌‌కు తరలించనున్నారు. ఇందుకోసం తూర్పు కోసి ప్రధాన కాలువను పునర్నిర్మించనున్నారు.