కేంద్ర ప్రభుత్వ విధానాలపై టోకెన్ సమ్మె : సీతారామయ్య

కేంద్ర ప్రభుత్వ విధానాలపై టోకెన్ సమ్మె : సీతారామయ్య

గోదావరిఖని, వెలుగు :  కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై మే 20న సింగరేణిలో ఒక రోజు టోకెన్​ సమ్మె నిర్వహించనున్నట్టు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్​కుమార్​ తెలిపారు. ఆదివారం సాయంత్రం గోదావరిఖనిలో యూనియన్​ కేంద్ర కమిటీ, బ్రాంచ్​ కమిటీల ఆఫీస్​ బేరర్స్​ మీటింగ్​జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ రూ.35 వేల కోట్లను వెంటనే చెల్లించి సంస్థను ఆదుకోవాలన్నారు.  

కొత్త గనులు వస్తేనే సింగరేణికి మనుగడ కొనసాగుతుందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత కార్మికుల కు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమాలు చేస్తామన్నారు. త్వరలో జరిగే డైరెక్టర్(పా) స్థాయి సమావేశంలో పలు వృత్తులకు సంబంధించిన డిజిగ్నేషన్ల మార్పు కోసం కృషి చేస్తామన్నారు. ఈ మీటింగ్​లో గుర్తింపు సంఘం లీడర్లు మిర్యాల రంగయ్య, ముస్కె సమ్మయ్య, మడ్డి ఎల్లాగౌడ్, ఎల్ ప్రకాశ్, కవ్వంపల్లి స్వామి, అక్బర్ అలీ, జూపాక రాంచందర్, ఆరెల్లి పోశం, జిగురు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.