కేసీఆర్​ వల్లే సింగరేణి ఆగం

కేసీఆర్​ వల్లే సింగరేణి ఆగం
  • అప్పుల పాల్జేసి జీతాలియ్యలేని పరిస్థితికి తెచ్చిండు
  • కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డి ఫైర్​
  • జెన్​కో నుంచే సింగరేణికి రూ. 8,056 కోట్ల బకాయిలు
  • బొగ్గు, విద్యుత్​కు సంబంధించి రూ. 30 వేల కోట్లు పెండింగ్​
  • వాటిని కేసీఆర్​ ఎందుకు ఇప్పియ్యలే.. సింగరేణిని ఓట్ల కోసమే వాడుకున్నడు
  • కార్మికుల డ్యూటీ కోసం కూడా ఎమ్మెల్యే చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చిండు
  • సింగరేణిలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ పెట్టిచ్చుకున్నడు
  • కేటీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నడు
  • పదేండ్లలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర సర్కార్​ విచారణ జరపాలి
  • పారదర్శకంగా గనుల వేలం నిర్వహిస్తున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సింగరేణిని గత బీఆర్​ఎస్ ప్రభుత్వం ఆగం చేసిందని, కార్మికులను కష్టాల్లోకి నెట్టిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘కేసీఆర్ కుటుంబం తమ రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థను దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చింది. 2014 ఏప్రిల్​లో సింగరేణి అకౌంట్​లో రూ.3,500 కోట్ల డిపాజిట్లు ఉంటే గత కేసీఆర్​ పాలన వల్ల ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి సంస్థ చేరుకుంది. మితిమీరిన జోక్యంతో సింగరేణిని కేసీఆర్​ ఫ్యామిలీ అప్పులపాలు చేసింది. నాశనం చేసింది” అని అన్నారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ నుంచి మొదలు ఎమ్మెల్యేల దాకా అందరూ సింగరేణి వ్యవహారాల్లోకి చొరబడి, ఇష్టానుసారంగా దోచుకున్నారని కిషన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సింగరేణి సంస్థలో ప్రొటోకాల్ పాటించాలని సర్క్యులర్ కూడా ఇప్పించుకున్నారని తెలిపారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివిధ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు కూడా గత బీఆర్​ఎస్​ సర్కారు తీరు వల్ల పేరుకుపోయాయని అన్నారు. ‘‘గత ప్రభుత్వం సరిగ్గా చెల్లింపులు జరపకపోవడంతో 2024 మార్చి 31 నాటికి  జెన్​కో నుంచి సింగరేణికి రూ. 8,056 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. బొగ్గు, విద్యుత్ కు సంబంధించి కూడా సుమారు రూ. 30 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. గత ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలు, ట్రాన్స్ కో, జెన్ కోకు చెల్లించి ఉంటే నేడు విద్యుత్ సంస్థల పరిస్థితి మెరుగ్గా ఉండేది. సింగరేణి సంస్థ కూడా సకాలంలో బిల్లులు చెల్లించే అవకాశం ఉండేది” అని ఆయన తెలిపారు. 

ఓట్ల కోసమే చూసిండు

2014కు ముందు ఏనాడూ సింగరేణిలో రాజకీయజోక్యం ఉండేది కాదని కిషన్​రెడ్డి అన్నారు. కానీ, కేసీఆర్  అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సర్పంచ్  మొదలు ఆ పార్టీ లీడర్లు సింగరేణిలోకి చొరబడి, ఇష్టానుసారంగా వ్యవహరించారని ఫైర్​ అయ్యారు. ‘‘సింగరేణి అధికారులను ఫైళ్లతో కేసీఆర్ కుటుంబ సభ్యుల చుట్టూ, నాటి మంత్రుల చుట్టూ తిప్పించుకున్నరు. కార్మికుడి డ్యూటీ షిఫ్ట్ మార్పు కోసం కూడా ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు అనేకసార్లు గత ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిసేందుకు ప్రయత్నించినా ఆయన ఏనాడు పట్టించుకోలేదు. కేసీఆర్ కుటుంబం ఇష్టారాజ్యంగా, ఎడాపెడా సింగరేణిని రాజకీయ క్షేత్రంగా వాడుకుంది. సింగరేణిపై ఆధారపడ్డ కుటుంబాల గురించి ఏరోజూ ఆలోచన చేయలేదు. ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడం కోసం సింగరేణిని ఒక సాధనంగానే కేసీఆర్​ చూశారు తప్ప.. సంస్థ అభివృద్ధి గురించి ఆలోచించలేదు” అని ఆయన అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ‘‘సింగరేణి ప్రైవేటీకరణ శుద్ధ అబద్ధం. ప్రైవేటీకరణ అనేది బీఆర్​ఎస్​ చేసిన విషప్రచారం” అని అన్నారు. 

అవకతవకలపై విచారణ జరపాలి

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణిలో ఎన్నో అవతవకలు, దోపిడీ, బిల్లుల గోల్ మాల్ జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.  గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే కేంద్రం  తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. మోదీ ప్రభుత్వం సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. 

పారదర్శకంగా వేలం

సుప్రీంకోర్టు తీర్పుకు తగ్గట్టు అవినీతికి తావులేకుండా, పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం వేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 9 రౌండ్లలో 107 బొగ్గు గనుల వేలం జరగ్గా,  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు రూ. 37 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, బొగ్గు గనుల వేలంతో 14 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఒడిశాలో ఏటా రూ. 36 వేల కోట్ల చొప్పున అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లభిస్తున్నదన్నారు. 

సింగరేణికి అండగా ఉంటా

సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తాము కృషిచేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, వారికి అన్ని రకాలుగా అండగా నిలబడుతామని, సంస్థను  రక్షించుకుంటామని తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలో బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుకునేలా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం సకాలంలో జరపకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని పేర్కొన్నారు. వేలంలో సింగరేణి పాల్గొంటుందా లేదా అన్నది ఆ సంస్థ స్పష్టం చేయలేదని తెలిపారు. ఓపెన్ ఆక్షన్  బొగ్గు గనుల వేలంతోనే సింగరేణికి లాభం జరుగుతుందన్నారు. ‘‘తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే జరుపుతాం. బొగ్గు ఉత్పత్తిని పెంచుకునేలా, ఉపాధి అవకాశాలను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటాం” అని వెల్లడించారు.  

నీట్​పై  విచారణ జరుగుతున్నది

నీట్ పరీక్షలకు సంబంధించి ఎక్కడా పేపర్ లీక్ కాలేదని, పేపర్లు తారుమారు అయ్యాయని కిషన్​రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై విచారణ జరుగుతుందని, విద్యార్థులకు న్యాయం చేసేలా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులపై  పెద్దఎత్తున కనీస మద్దతు ధర పెంచేలా నిర్ణయం తీసుకున్నందున తెలంగాణ రైతుల తరఫున ప్రధాని  మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్​ హామీల అమలు ఏమైంది?

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ‘‘అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ నియామకాలు చేస్తామని కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీని విస్మరించింది. హామీల అమలుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. 6 గ్యారంటీలను వందరోజుల్లో అమలు చేస్తామని సోనియా గాంధీ తన సంతకంతో కూడిన ఉత్తరాన్ని ప్రతి ఇంటికి పంపించారు.. కానీ, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకే గ్యారంటీ లేకుండా పోయింది.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ తప్పితే మిగతా హామీలను తుంగలో తొక్కారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2,500  ఆర్థిక సాయం, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు, విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా కార్డులు, నిరుద్యోగులకు రూ. 4 వేల చొప్పున భృతి ఏమయ్యాయి?” అని ఆయన ప్రశ్నించారు.

విద్యార్థి, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ  రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్  ముందు ధర్నా చేస్తే విచక్ష ణారహితంగా పోలీసులు దాడి చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై ఎమ్మెల్యే రాజాసింగ్​ చేసిన కామెంట్లను మీడియా ప్రస్తావించగా..  అది పార్టీ అంతర్గత విషయమని కిషన్​రెడ్డి అన్నారు.