- ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు రిలీజ్ చేసిన కేంద్రం
- ఓవరాల్ కేటగిరీలో రాష్ట్రం నుంచి నాలుగు సంస్థలు
- ఐఐటీ హెచ్‌కు12,హెచ్సీయూకు 25, ఎన్ఐటీకి 53, ఓయూకు 70 ర్యాంకులు
- వర్సిటీ కేటగిరీలో ఓయూకు 43వ ర్యాంకు.. ఇంజినీరింగ్ కేటగిరీలో జేఎన్టీయూకు 88వ ర్యాంకు
హైదరాబాద్, వెలుగు: దేశంలోని విద్యాసంస్థలకు 2024 సంవత్సరానికి నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులను కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో గతేడాదితో పోలిస్తే రాష్ట్ర వర్సిటీల ర్యాంకులు మరింత దిగజారిపోయాయి. ఐఐటీహెచ్ మినహా మిగిలిన హెచ్ సీయూ, ఓయూ ర్యాంకులు పడిపోయాయి. దేశంలోని విద్యాసంస్థల్లో టీచింగ్ లర్నింగ్ అండ్ రీసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టిసెస్, గ్రాడ్యుయేషన్ ఔట్ కమ్స్, అవుట్ రీచ్ అండ్ ఇన్ క్లూజివిటీ, పర్ఫెక్షన్.. ఈ ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుని 16 కేటగిరీల్లో ర్యాంకులు కేటాయించారు. వీటిలో ఈ ఏడాది కొత్తగా స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్, ఓపెన్ వర్సిటీస్, స్కిల్ యూనివర్సిటీస్ కేటగిరీలనూ కొత్తగా ప్రకటించారు.
మరో ఓవరాల్ కేటగిరీ, యూనివర్సిటీలు, కాలేజీలు, రీసెస్చ్ ఇనిస్టిట్యూషన్స్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, మెడికల్, డెంటల్, లా, అర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, అగ్రికల్చర్ అండ్ అలియేడ్ సెక్టార్స్, ఇన్నోవేషన్ తదితర వాటిల్లో టాప్ విద్యాసంస్థలకు ర్యాంకులను అలాట్ చేశారు.
ఐఐటీ మద్రాస్ నంబర్1
ఇవన్నీ కూడా 2022–23 వివరాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ చేయక.. ప్రమాణాలు భారీగా పడిపోయాయి. ఓవరాల్ కేటగిరీలో ఈ ఏడాది కూడా ఐఐటీ మద్రాస్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ నిలిచాయి. ఈ కేటగిరీలో టాప్ 100లో తెలంగాణ నుంచి 4 విద్యాసంస్థలకు చోటు లభించింది. ఐఐటీహెచ్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 12వ ర్యాంకు సాధించింది. హెచ్ సీయూ 25వ ర్యాంకు, ఎన్ఐటీ వరంగల్ 53, ఉస్మానియా యూనివర్సిటీ 70వ ర్యాంకు సాధించింది.
పడిపోయిన వర్సిటీల ప్రమాణాలు..
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో ఓయూ, కాకతీయ, జేఎన్టీయూ భారీగా పడిపోయాయి. ఓవరాల్ కేటగిరీలో టాప్ వందలో స్టేట్ వర్సిటీ ఓయూ మాత్రమే ఉంది. గతేడాది ఓయూ 64 వ ర్యాంకు పొందగా, ఈసారి 70కి దిగజారింది. యూనివర్సిటీ కేటగిరీలో ఓయూ లాస్టియర్ 36వ ర్యాంకు ఉండగా, ఈ సారి 43కి చేరింది. అయితే, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ కేటగిరీలో మాత్రం ఓయూ ఆరో ర్యాంకు పొందింది.
ఇంజినీరింగ్ లో ఐఐటీహెచ్ 8వ ర్యాంకు పొందింది. ఇదే కేటగిరీలో జేఎన్టీయూకు గతేడాది 83వ ర్యాంకు ఉంటే, ఈసారి 88కి దిగజారింది. మెడికల్ కేటగిరీలో ఓయూ మెడికల్ కాలేజీకి 48 వ ర్యాకు సాధించింది. ఫార్మసీ కేటగిరీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్ (నైపర్) ఈ సారి రెండోస్థానానికి పడిపోయింది. లా కేటగిరీలో నల్సార్ లా వర్సిటీ మూడో ర్యాంకు పొందింది.