సీనియర్ పార్లమెంటేరియన్, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ ఈ ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. జశ్వంత్ సింగ్ గుండెపోటుతో ఆదివారం ఉదయం 6:55 గంటలకు చనిపోయారని ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ ప్రకటించింది. జశ్వంత్ జూన్ 25, 2020న సెప్సిస్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత మల్టీఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ మరియు గతంలో తలకు అయిన తీవ్రమైన గాయం కారణంగా ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
రాజస్థాన్‌లో జనవరి 3, 1938న జన్మించిన జశ్వంత్ సింగ్ వాజ్‌పేయి హయాంలో భారత విదేశాంగ మంత్రిగా, రక్షణ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన 1980 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. అయిదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా.. నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జశ్వంత్ 1998-99లో ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా 2004-2009 మధ్యకాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆయన 1950 నుంచి 1960 వరకు భారత సైన్యంలో మేజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలలో రావాలనే ఉద్దేశంతో మేజర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
జశ్వంత్ మృతి పట్ల ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. జశ్వంత్ సైనికుడిగా దేశానికి ఎంతో సేవ చేశారని మోడీ కొనియాడారు. మంత్రిగా ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలపై చెరగని ముద్ర వేశారని మోడీ ట్వీట్ చేశారు. జశ్వంత్ మృతి ఎంతో బాధ కలిగించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర మంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశానికి జశ్వంత్ ఎంతో సేవ చేశారని ఆయన ట్వీట్ చేశారు. రాజస్థాన్‌లో బీజేపీ బలోపేతానికి జశ్వంత్ కృషి చెప్పుకోదగినదని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
For More News..