- ద్రవ్యోల్బణం తగ్గుతున్నది.. అన్ని వర్గాలకు అండగా కేంద్రం
- బడ్జెట్ స్పీచ్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: గ్లోబల్ ఎకానమీ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇండియా ఎకానమీ మాత్రం షైనింగ్ అవుతున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్) తగ్గుముఖం పడ్తున్నదని, టార్గెట్ 4 శాతాన్ని త్వరలో చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటున్నదని, వారిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. మంగళవారం లోక్‌సభలో ఆమె 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఫుల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మంగళవారం ఉదయం 11.04 గంటలకు ప్రారంభమైన నిర్మల బడ్జెట్ స్పీచ్ దాదాపు మధ్యాహ్నం 12.30 గంటల వరకు ముగిసింది.
తొమ్మిది ప్రాధామ్యాలు
దేశ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి అధికారంలోకి వచ్చామని, ప్రజల కలలు నెరవేర్చేందుకు తాము కృషి చేస్తున్నామని బడ్జెట్ స్పీచ్‌లో నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌కు కొనసాగింపుగా ఈ ఫుల్ బడ్జెట్‌ను తీసుకువస్తున్నామని తెలిపారు. మధ్యంతర బడ్జెట్లో పేదలు, మహిళలు, యువత, రైతులకు ప్రయారిటీ ఇచ్చామని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి గరీబ్ అన్నాకల్యాణ్ యోజనను మరో ఐదేండ్లకు పెంచామని, దీంతో 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ప్రస్తుత ఫుల్బడ్జెట్లో తొమ్మిది ప్రయారిటీస్ పెట్టుకున్నామని తెలిపారు. 1. ప్రొడక్టివిటీ అండ్ రిసీవియన్స్ ఇన్ అగ్రికల్చర్, 2. ఎంప్లాయిమెంట్ అండ్ స్కిల్లింగ్, 3. ఇంక్లూసివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టీస్, 4. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్, 5. అర్బన్ డెవలప్మెంట్, 6. ఎనర్జీ సెక్యూరిటీ, 7. ఇన్ఫ్రాస్ట్రక్చర్, 8. ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, 9. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్ అని ఆమె వివరించారు. దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేందుకు వివిధ వస్తువులపై కస్టమ్ డ్యూటీస్‌ను తగ్గిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ మందులపై కూడా కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే రెండేండ్లలో దాదాపు కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించనున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. యువతకు ఉద్యోగావకాశాలు పెంచేందుకు ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ప్రత్యేక పథకాలు రూపొందించినట్లు వివరించారు.
రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష లేదు
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష లేదని, అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మంగళవారం ఉదయం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సాయంత్రం మీడియాతో ఆమె మాట్లాడారు. ఎన్డీయే కూటమిలోని మిత్రపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలకే బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు జరిపారని, ఇది ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నమన్న ప్రతిపక్షాల విమర్శలను ఆమె కొట్టిపారేశారు. ‘‘ఇండి కూటమి అంతా కలిసి కూడా బీజేపీ ఒంటరిగా తెచ్చుకున్న సీట్లను కూడా తెచ్చుకోలేకపోయింది. ప్రధాని మోదీ నేతృత్వంలో మేం బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇది చరిత్రాత్మకం” అని అన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి తాము ప్రతిపాదనలు తీసుకున్నామని, అవన్నీ ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగుతున్నాయని చెప్పారు. పశ్చిమబెంగాల్‌కు బడ్జెట్లో స్థానం కల్పించలేదంటున్న వాళ్లు బడ్జెట్ పుస్తకంలోని పూర్వోదయ స్కీమ్ పేరాగ్రాఫ్‌ను చదవాలని, స్పీచ్‌లో రాష్ట్రం పేరు చెప్పనంత మాత్రాన ఆ రాష్ట్రానికి బడ్జెట్లో కేటాయింపులు లేవనుకుంటే ఎట్లా అని ప్రశ్నించారు. కాగా, కొత్త పన్నువిధానంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసినందున పాత పన్నువిధానాన్ని రద్దుచేస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పన్ను విధానాన్ని ఈజీ చేయడమే కొత్త పన్ను విధానమని పేర్కొన్నారు.
వరుసగా ఏడోసారి
బడ్జెట్ ప్రవేశపెట్టడంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుత బడ్జెట్‌తో కలిపి వరుసగా ఏడోసారి ఆమె లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. ఇప్పుడు ఆ రికార్డును నిర్మల బ్రేక్ చేశారు. ఎక్కువ నిడివి గల బడ్జెట్ స్పీచ్ ఇచ్చిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్ పేరిటే ఉంది. 2020 ఫిబ్రవరిలో 2 గంటల 40 నిమిషాల పాటు ఆమె బడ్జెట్‌ను చదివారు. ప్రస్తుత బడ్జెట్ స్పీచ్ ఒక గంట 25 నిమిషాల పాటు కొనసాగింది.