న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యంగా 2025-2026 ఆర్ధిక సంవత్సర బడ్జెట్- రూపొందించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ, వైద్య రంగాలకు పెద్దపీట వేశామని తెలిపారు. విద్యారంగానికి కూడా బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేశామన్నారు. బడ్జెట్లో ముఖ్యంగా 6 రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాంమని స్పష్టం చేశారు.
అలాగే.. ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చామని.. పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేశామని తెలిపారు. రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న ఉద్యోగులకు ఊరట కల్పించామన్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ పెంపుతో మిడిల్ క్లాస్ వర్గాలకు మేలు జరుగుతోందని పేర్కొన్నారు. రూ.8 లక్షల వార్షికాదాయం ఉన్నవారు ఇప్పటి వరకు రూ.30 వేలు పన్ను కట్టేవారని.. ఇకపై ఏమి కట్టనక్కర్లేదని క్లారిటీ ఇచ్చారు.
ALSO READ | దేశ ప్రజల ఖాతాల్లోని సేవింగ్స్ను పెంచే విధంగా బడ్జెట్ ఉంది: ప్రధాని మోదీ
వ్యవసాయ రంగానికి అన్ని విధాలుగా అండగా ఉన్నామని.. విత్తనం నుంచి మార్కెట్ వరకు అన్ని రకాల మార్పులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పెట్టుబడి సాయం, రుణాలు, కొత్త వంగడాల సృష్టి.. ఇలా అనేక రకాలుగా రైతుకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని మరింత మెరుగుపర్చామన్నారు. ఈ బడ్జెట్లో విద్యుత్ తయారీ, పంపిణీలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పెరుగుతోన్న అవసరాలకు తగినట్లు విద్యుదుత్పత్తి, పంపిణికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.