మన దేశంలో ఎంపీల జీతాలు పెరిగినయ్.. ఇకపై నెలకు లక్ష కాదు.. అంతకు మించి..

మన దేశంలో ఎంపీల జీతాలు పెరిగినయ్.. ఇకపై నెలకు లక్ష కాదు.. అంతకు మించి..

న్యూఢిల్లీ: దేశంలోని పార్లమెంట్ సభ్యుల జీతాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంపీల శాలరీ 24 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటిదాకా నెలకు లక్ష రూపాయలు జీతం తీసుకున్న ఎంపీలు ఇకపై లక్షా 24 వేలు తీసుకోనున్నారు. ఈ జీతం పెంపు ఏప్రిల్ 1, 2023 నుంచి ఎంపీలు పొందిన జీతంపై కూడా వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

ఎంపీల జీతం మాత్రమే కాదు రోజువారీ ఖర్చులను కూడా 2 వేల నుంచి 2 వేల 500 వరకూ పెంచింది. మాజీ పార్లమెంట్ సభ్యుల పెన్షన్ను కూడా 25 వేల నుంచి 31 వేలకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. వీటితో పాటు ఎంపీలకు వార్షిక ఫోన్, ఇంటర్నెట్ యూసేజ్ బిల్లుల అలవెన్స్ కూడా చెల్లించాలని కేంద్రం నిర్ణయించింది.

ALSO READ | డిప్యూటీ సీఎంపై జోకులు.. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాపై కేసు

కర్ణాటక అసెంబ్లీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను నూరు శాతం పెంచిన రోజుల వ్యవధిలోనే మన దేశంలో ఎంపీల జీతాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కర్ణాటకలో ఎమ్మెల్యేల జీతాలను పెంచడం వల్ల సంవత్సరానికి 62 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడింది.

కర్ణాటకలో ముఖ్యమంత్రి జీతం 75 వేల రూపాయలు ఉండేది. ఈ జీతాన్ని లక్షన్నరకు పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మంత్రుల జీతం 60 వేల నుంచి లక్షా పాతిక వేలకు పెరిగింది. కర్ణాటక ఎమ్మెల్యేల జీతం 40 వేల నుంచి 80 వేలకు పెరిగింది. పెన్షన్లు 50 వేల నుంచి 75 వేలకు పెరగడం గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ జీతాలు 75 వేల నుంచి లక్షా పాతిక వేలకు ప్రభుత్వం పెంచింది.