వరంగల్​ కు నియో మెట్రో.. రూ.998 కోట్లతో ప్రతిపాదనలు.. తెలంగాణ సర్కారు స్పందించట్లే : కేంద్రం

తెలంగాణ రాష్ట్రం అప్పులు 2022 సంవత్సరం నాటికి రూ.3,12,191 కోట్లకు చేరాయని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2018 నాటికి ఇవి రూ.1,60,296  కోట్లు ఉండేవని తెలిపింది. BRS ఎంపీలు రంజిత్  రెడ్డి, కవిత అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ఈ సమాధానం ఇచ్చింది. గత ఐదేళ్ల వ్యవధిలో రాష్ట్ర అప్పులు 94.75 శాతం పెరిగాయని పేర్కొంది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతోందని వివరించింది. 

తెలంగాణలో మెట్రో రైల్ ప్రాజెక్టులపై రాజ్యసభలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి కౌశల్ కిషోర్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. హైదరాబాద్ మెట్రో కారిడార్ ఫేజ్ - 2 కింద  తెలంగాణ సర్కారు మెట్రో ప్రొజెక్ట్ ను మొదలు పెడుతోందని తెలిపారు. ఎయిర్ పోర్ట్ మెట్రోలో భాగంగా MMTS స్టేషన్లను కూడా కలుపుతోందన్నారు. వరంగల్ నియో మెట్రో కింద 15.5 కిలోమీటర్ల కు రూ.998 కోట్లతో ప్రపోజల్ వచ్చిందని, అయితే కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించిన మార్పులతో మరోసారి ప్రతిపాదనలు పంపాలని సూచించగా  తెలంగాణ సర్కారు స్పందించలేదని స్పష్టం చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలకు సంబంధించిన ప్రపోజల్స్ ఏవీ రాలేదని తెలిపింది.