బీసీ ముసుగులో ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం :కేంద్ర హోంమంత్రి అమిత్ షా

బీసీ ముసుగులో ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం :కేంద్ర హోంమంత్రి అమిత్ షా
  • కలిసి పని చేయండి.. రాష్ట్రంలో అధికారం మనదే: అమిత్ ​షా
  • ప్రజల్లో కాంగ్రెస్​పై విపరీతమైన కోపం: జేపీ నడ్డా
  • బీజేపీ నేతలకు అగ్రనేత దిశానిర్దేశం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం ఆమోదించేది లేదని రాష్ట్ర బీజేపీ నేతలకు పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్ట చేశారు. అయితే బీసీ రిజర్వేషన్ కు వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పుబడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో క్షేత్ర స్థాయిలో తెలంగాణ ప్రజలకు వాస్తవాలను వివరించాలని పార్టీ నేతలు దిశానిర్ధేశం చేశారు. అలాగే గ్రూపులకు ఆస్కారం లేకుండా, కలిసి గట్టుగా పని చేయాలని ఆదేశించారు.

గురువారం పార్లమెంట్ లో అమిత్‌‌ షా ను ఆయన ఆఫీసులో రాష్ట్ర బీజేపీ బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో కొత్తగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డితో పాటు కేంద్ర మంత్రులు, కిషన్​రెడ్డి, బండి సంజయ్‌‌, ఎంపీలు లక్ష్మణ్‌‌, డీకే అరుణ, అర్వింద్, కొండా విశ్వేశ్వర్‌‌ రెడ్డి, నగేష్‌‌, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు తదితరులు ఉన్నారు. ఈ భేటీలో.. కొత్తగా ఎన్ని-కై-న ఎమ్మెల్సీలను అమిత్‌‌ షా అభినందించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను అమిత్ షా కు కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై షా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై షా స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లో ఈ మతపరమైన బిల్లుకు ఆమోదం తెలిపేది లేదని చెప్పినట్లు తెలిసింది. అయితే కేంద్రంలోని బీజేపీ బీసీలకు వ్యతిరేకం కాదని, ఈ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పుబడుతున్నట్లు ప్రజలకు వివరించాలని చెప్పినట్టు సమచారం. 

విజయావకాశాలు పుష్కలం: నడ్డా

పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో రాష్ట్ర బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనూ రాష్ట్ర రాజకీయాలను చర్చించినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలపై నడ్డా తెలంగాణ నేతలను అభినందించారు. ఇలాగే కష్టపడితే తెలంగాణలో అధికారం సాధించవచ్చని వారికి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని, బీజేపీకి తెలంగాణలో విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర నేతలు వివరించారు.

అన్ని వర్గాల్లో కాంగ్రెస్​పై అసంతృప్తి: ఎమ్మెల్సీలు

కాంగ్రెస్‌‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని కొత్తగా గెలిచిన బీజేపీ ఎమ్మెల్సీలు అన్నారు. తాజా ఎన్నికల ఫలితాలు ఉపాధ్యాయులు, పట్టభద్రులు మార్పు కోరుకుంటు-న్నారని చెప్పేందుకు నిదర్శనమన్నారు. జేపీ నడ్డాతో భేటీ తర్వాత ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు కాంగ్రెస్‌‌ పాలనపై అసంతృప్తితో ఉన్నాయని మల్క కొమరయ్య అన్నారు. కాంగ్రెస్‌‌ సిట్టింగ్‌‌ సీటు-ను గెలుచుకున్నందుకు బీజేపీ అగ్రనేతలు అభినందించారని మరో ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్పారు.