వచ్చే ఐదేండ్లలోపే జమిలి ఎన్నికలు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన

వచ్చే ఐదేండ్లలోపే జమిలి ఎన్నికలు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన
  • మోదీ 3.0 సర్కార్​కు 100 రోజులు
  • కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టును వివరించిన షా 
  • జనాభా లెక్కలపై అతి త్వరలోనే ప్రకటన
  • మణిపూర్​లో శాంతికి ప్రయత్నిస్తున్నామని వెల్లడి
  • కేంద్ర హోం మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే వచ్చే ఐదేండ్లలోపే జమిలి ఎన్నికల విధానాన్ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ‘‘ఈ ప్రభుత్వ పదవీకాలంలోనే వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం” అని ఆయన వెల్లడించారు. మోదీ 3.0 సర్కారుకు వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​తో కలిసి మీడియా సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. గత వంద రోజుల్లో మోదీ సర్కారు పాలనకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును వివరించారు. 

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ దేశ ఫారిన్ పాలసీ బలహీనంగా ఉండేదని, మోదీ హయాంలోనే తొలిసారిగా మన విదేశీ విధానం దృఢంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణపై అతి త్వరలోనే ప్రకటన వెలువడుతుందని ఆయన తెలిపారు. అలాగే, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించామని కేంద్ర మంత్రి తెలిపారు.  అలాగే 5 కోట్ల మంది గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు 63 వేల గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. గిరిజనుల కోసం ఏకలవ్య మోడల్ స్కూల్స్ ప్రవేశపెట్టామని చెప్పారు.

మైతీ, కుకీ వర్గాలతో చర్చిస్తున్నాం.. 
మణిపూర్​లో శాంతిని నెలకొల్పేందుకు గాను మైతీ, కుకీ వర్గాలతో చర్చలు జరుపుతున్నామని అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం మణిపూర్ లో గొడవలు సద్దుమణిగాయని, గత మూడు నెలల్లో ఎక్కడా పెద్ద స్థాయిలో హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు. 

ఫార్మర్ ఫ్రెండ్లీ విధానాల అమలు.. 
మోదీ థర్డ్ టర్మ్ లోని తొలి వంద రోజుల్లో రైతులకు స్నేహపూర్వకమైన అనేక విధానాలను ప్రభుత్వం అమలు చేసిందని అమిత్ షా చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకత, ఎగుమతులు పెంచేందుకు చర్యలు చేపట్టిందన్నారు. మొత్తంగా 14 రంగాల్లో రూ. 15 లక్షల కోట్ల విలువైన పాలసీలను మోదీ సర్కారు అమలు చేసిందన్నారు. ‘‘రైతుల జీవనాధారం పెంచేందుకు రూ.14,200 కోట్లతో 7 పథకాలను అమలు చేశాం.

పీఎం కిసాన్ స్కీం కింద 9.3 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్లు పంపిణీ చేశాం” అని హోంమంత్రి వివరించారు. పంటలకు కనీస మద్దతు ధరలను పెంచామని, ఎంఎస్పీతో పంట ఉత్పత్తుల సేకరణ ద్వారా రైతులకు రూ. 2 లక్షల కోట్ల లబ్ధి జరుగుతుందన్నారు. అలాగే డీఏపీ సబ్సిడీ టన్నుకు రూ. 3,500 వరకు ఇస్తున్నామన్నారు. ఏపీలో రైతులకు సాగునీటి సౌకర్యానికి పోలవరం నిర్మాణం కోసం కేంద్రం రూ.12,100 కోట్లను మంజూరు చేసిందన్నారు.