- అవినీతి లేని మోదీ ఒక వైపు.. కోటీశ్వరుడైన రాహుల్ మరోవైపు..
- ఎవరు కావాల్నో ప్రజలే ఆలోచించుకోవాలి: అమిత్ షా
- ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందిస్తం
- అయోధ్య రామాలయ ప్రారంభానికి పిలిస్తే రాహుల్, సోనియా, ఖర్గే ఎందుకు రాలే
- ఒవైసీలకు కోపం వస్తదన్న భయంతోనే దూరంగా ఉన్నరు
- రాష్ట్రాన్ని కేసీఆర్ బర్బాద్ చేసిండు.. అదే బాటలో రేవంత్
- రాష్ట్రంలో పదికిపైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా
- కాగజ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం
ఆసిఫాబాద్ / కాగజ్ నగర్/ నిజామాబాద్/ హైదరాబాద్, వెలుగు: అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ, రాహుల్ టీమ్ నడుస్తున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ‘‘ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమికి 57 సీట్లు కూడా రావు. రెండు విడతల్లో జరిగిన పోలింగ్ లో ఇప్పటికే ఎన్డీయే కూటమి సెంచరీ కొట్టింది” అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌తోపాటు నిజామాబాద్, హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సభల్లో అమిత్ షా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరుగుతున్నదని, ఇప్పుడు 10 కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
రూ.12 లక్షల కోట్ల లూటీ చేసిన కాంగ్రెస్, ఇండియా కూటమిని ప్రజలు నమ్మరు. మూడు సార్లు సీఎంగా, రెండుసార్లు పీఎంగా చేసిన మోదీపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఒక్క వైపు కోట్ల అధిపతి రాహుల్ బాబా టీమ్ ఉంటే.. మరోవైపు పేద కుటుంబం నుంచి వచ్చిన చాయ్‌వాలా ఉన్నారు. ప్రజలు ఎటువైపో ఆలోచించుకోవాలి” అని ఆయన అన్నారు. ‘‘ఇండి కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పే పరిస్థితి లేదు. శరద్ పవార్ ను చేస్తరా... మమతా బెనర్జీని చేస్తరా..? స్టాలిన్ ను చేస్తరా.. రాహుల్ గాంధీని చేస్తరా?” అని ప్రశ్నించారు.
రామాలయ ప్రారంభానికి పిలిస్తే రాలే
అయోధ్యలో రామమందిరం కట్టాలన్న అంశాన్ని 70 ఏండ్ల పాటు కాంగ్రెస్ నేతలు నాన్చారని అమిత్ షా మండిపడ్డారు. ‘‘రామమందిరం ప్రారంభానికి రాహుల్, సోనియా, మల్లికార్జున ఖర్గేకు ఇన్విటేషన్ ఇచ్చినా రాలేదు. ఒవైసీ మిత్రులు కోపంతో ఎక్కడ దూరమవుతారన్న భయంతోనే వాళ్లు రాలే” అని అన్నారు. యూపీఏ సర్కారు పదేండ్ల పాలన అల్లర్లతో నడిచిందని, మోదీ సర్కారు మాత్రం ఉగ్రవాదుల భరతం పట్టి పాకిస్థాన్ కు చుక్కలు చూపించిందని ఆయన తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను అంతమొందించడమే బీజేపీ విధానమన్నారు. దేశమంతటా నిర్మూలించిన నక్సలిజం ఒక్క చత్తీస్‌గఢ్‌లోని కొంత భాగంలో మాత్రమే ఉందని, ఈసారి మళ్లీ మోదీ వచ్చాక అక్కడ కూడా లేకుండా చేస్తామని ఆయన చెప్పారు.
ఫేక్ వీడియో పెట్టిండు
తనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫేక్ వీడియో పెట్టడంతోనే ఢిల్లీ పోలీసులు ఆయన వెంటపడుతున్నారని అమిత్ షా అన్నారు. ‘‘బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాష్ట్రాన్ని బర్బాద్ చేసిండు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంఅదే బాటలో నడుస్తున్నది. ఢిల్లీ పెద్దలకు ఏటీఎంగా మారింది. డబుల్ ఆర్ట్యాక్స్లు వసూలు చేసి ఢిల్లీ దర్బార్‌కు పంపుతున్నది. రోజూ కోట్లాది రూపాయలు కాంగ్రెస్‌కు తెలంగాణ నుంచి వెళ్తున్నయ్” అని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ సహా తెలంగాణ సమాజం నుంచి దోచుకున్న సొమ్ము లెక్కలను ప్రజల ముందు కేసీఆర్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అందజేస్తామని అన్నారు. బీజేపీ, మోదీ ఉన్నంతవరకూ ఈదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదని చెప్పారు. పందేండ్లు ప్రధాని మోదీ తన అధికారాన్ని ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్తలాక్ రద్దు, పీఎఫ్ఐ నిషేధం కోసం ఉపయోగించారు కానీ.. రిజర్వేషన్ల రద్దు కోసం కాదని ఆయన తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీగా గోడెం నగేశ్‌ను, నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్‌ను, మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్‌ను, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా తిలక్‌ను గెలిపించాలని ఆయన కోరారు. తమకు ఎక్కువ సీట్లు ఇస్తే.. తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా మారుస్తామని అన్నారు.
పసుపు బోర్డు ఇక్కడే..!
పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రధాని మోదీని ధర్మపురి అర్వింద్ వెంటబడి ఒప్పించారని అమిత్‌షా అన్నారు. బోర్డు హెడ్ క్వార్టర్‌పై అనుమానాలు వద్దని, నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. బోధన్, మెట్పల్లిలో క్లోజ్‌అయిన చక్కెర ఫ్యాక్టరీలను కో–ఆపరేటివ్ బేసిస్‌లో రైతులకు లాభం కలిగించే రీతిలో ఓపెన్ చేస్తామని అన్నారు. బీడీ కార్మికులు కోరుకునే హాస్పిటల్మోదీ గ్యారెంటీగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామరావు పటేల్, ధన్పాల్ సూర్యానారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.