- తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలి
- కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీలు
- బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో బీసీ సీఎం కావడం ఖాయం
- సకల జనుల విజయ సంకల్ప సభల్లో కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యలు
గద్వాల/ నల్గొండ/ హనుమకొండ/ వరంగల్, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ కు రిటైర్మెంట్ టైమ్ వచ్చేసిందని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ బూటకపు హామీలతో మోసం చేశారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం జోగులాంబ గద్వాల, నల్గొండ, వరంగల్జిల్లా ఖిలా వరంగల్ లో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభల్లో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ సర్కార్ అవినీతిలో మునిగిపోయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే.. ‘భ్రష్టాచార్(అవినీతి) రిశ్వత్కోర్(లంచగొండి) సమితి’ అని విమర్శించారు. మిషన్ కాకతీయలో రూ.4 వేల కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.40 వేల కోట్లు, మిషన్ భగీరథలో రూ.22 వేల కోట్లు, మియాపూర్భూకుంభకోణంలో రూ. 4 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, మద్యం, సారా కుంభకోణాలకు పాల్పడ్డారని, అలాంటి పార్టీని తెలంగాణ ప్రజలు ఇంటికి పంపటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్అవినీతిని కూకటి వేళ్లతో పెకిలిస్తామని, అవినీతి కుంభకోణాలపై దర్యాప్తు చేసి.. బాధ్యులైన వాళ్లను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ కారును గ్యారేజీకి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
2జీ,3జీ,4జీ పార్టీలను నమ్మకండి
2జీ, 3జీ, 4జీ పార్టీలను తరిమికొట్టాలని అమిత్షా అన్నారు. రెండుతరాల బీఆర్ఎస్, మూడుతరాల ఎంఐఎం, నాలుగు తరాల కాంగ్రెస్.. ఈ మూడు పార్టీలు ఒకటేనని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేండ్లలో తెలంగాణలో 2.5 లక్షల సర్కార్ జాబ్స్ ఇస్తామన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, నిర్మాణం పూర్తి చేశామని, విగ్రహ పూజను మోదీ జనవరి 22న చేస్తారని వెల్లడించారు. అధికారంలోకి వస్తే ఫ్రీగా అయోధ్యలో రామ మందిర దర్శనం చేయిస్తామన్నారు.
శక్తిపీఠాన్ని మోసం చేసిన కేసీఆర్
జోగులాంబ శక్తి పీఠాన్ని కూడా కేసీఆర్ మోసం చేశారని అమిత్షా మండిపడ్డారు. శక్తి పీఠానికి ప్రధాని మోదీ రూ.70 కోట్లు రిలీజ్ చేస్తే వాటిని కూడా ఖర్చు చేయలేదని, కేసీఆర్ ఇస్తానన్న రూ.100 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. గద్వాల జిల్లాలో గుర్రంగడ్డ బ్రిడ్జి, గట్టు లిఫ్ట్, జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు, 300 బెడ్స్ హాస్పిటల్, కృష్ణానదిపై కొత్త వంతెన పనులు చేయకుండా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
‘‘రాహుల్ బాబా అండ్కంపెనీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీకి కేవలం రెండు లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే రూ. 2.5 లక్షల కోట్లు ఇచ్చింది”అని గుర్తు చేశారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే వెయ్యి కోట్లతో ఎంజీఎంను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు రూ. 3,300 కోట్లు పెట్టినా రూ. 77 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని మండిపడ్డారు.