న్యూఢిల్లీ: గత పదేండ్లలో డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని, కానీ.. ఢిల్లీ మాత్రం వెనుకబడి పోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఆప్ కొట్లాడుతూ ఉండడమే అందుకు కారణమని ఆయన ఆరోపించారు. సోమవారం ఢిల్లీలోని జంగ్ పుర, బిజ్ వాసన్‌లో బీజేపీ అభ్యర్థులు తర్విందర్ సింగ్ మార్వా, కైలాష్ గహ్లోత్ తరపున అమిత్ షా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆ రెండు నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. బడేమియా (కేజ్రీవాల్), ఛోటేమియా (సిసోడియా) కలిసి ఢిల్లీని లూటీ చేశారని విమర్శించారు. దేశంలో లిక్కర్ స్కామ్‌లో జైలుకెళ్లిన ఒకే ఒక్క విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తిన్నదంతా కక్కిస్తామని పేర్కొన్నారు. జంగ్‌పుర నియోజకవర్గ ప్రజల ఉత్సాహం చూస్తుంటే, ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని తెలుస్తోందన్నారు.
మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌పైనా అమిత్ షా తీవ్రంగా విమర్శలు చేశారు. ‘‘యమునా నదిని శుభ్రం చేస్తానని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ అబద్ధం చెప్పాడు. బదులుగా ఢిల్లీకి చెత్తాచెదారం, విషపూరిత నీళ్లు ఇచ్చాడు. ఢిల్లీ వీధులను లండన్ వీధుల్లా మారుస్తానని మోసం చేశాడు. ఆప్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల వర్షాకాలంలో ఢిల్లీలో వరదలు వస్తున్నాయి. మాకు అధికారం ఇస్తే, యమునా నదిని శుభ్రం చేస్తాం. బీజేపీ మాత్రమే ఢిల్లీని ప్రపంచలోనే బెస్ట్ క్యాపిటల్ సిటీగా మార్చగలదు” అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
సౌకర్యాలు తీసుకోనంటూనే..
సీఎం అయ్యాక ప్రభుత్వ సౌకర్యాలు పొందనంటూనే కేజ్రీవాల్ అన్ని రకాల సౌకర్యాలు అనుభవించారని అమిత్ షా ఫైర్ అయ్యారు. కారు, ప్రభుత్వ బంగ్లా, సెక్యూరిటీ తీసుకున్నారని విమర్శించారు. ఒక బంగ్లాతో సంతృప్తి చెందకుండా నాలుగు బంగ్లాలను పడగొట్టించి, 50 వేల గజాల్లో శీష్ మహల్ నిర్మించుకున్నారని అమిత్ షా మండిపడ్డారు.