కాసేపట్లో ఖమ్మంలో బీజేపీ సభ
రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా సభ
తర్వాత రాష్ర్ట నాయకత్వంతో భేటీకానున్న అమిత్ షా
ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై దిశానిర్దేశం
ఖమ్మంలో నిర్వహించే సభ కోసం గన్నవరం ఎయిర్ పోర్టుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేరుకున్నారు. అక్కడి నుంచి ఖమ్మం టౌన్ కు బయలుదేరారు. కాసేపట్లో ఖమ్మంలో సభ జరగనుంది. గన్నవర్ ఎయిర్ పోర్టులో అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి తానేటి వనిత స్వాగతం పలికారు.
రైతు గోస.. బీజేపీ భరోసా పేరిట ఆదివారం (ఆగస్టు 27న) ఖమ్మంలో భారీ సభను బీజేపీ నిర్వహిస్తోంది. ఈ మీటింగ్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా సభను బీజేపీ నిర్వహిస్తోంది. ఖమ్మంలోని ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్ లో కాసేపట్లో సభ ప్రారంభం కానుంది.
మరోవైపు.. పలువురు నాయకులు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. సమావేశం తర్వాత రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి..? ఎలాంటి వ్యూహం అనుసరించాలి..? అనే విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. బస్సు యాత్రల తేదీలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే ఖమ్మం టౌన్ కాషాయమయంగా మారింది. ఎక్కడ చూసినా బీజేపీ పోస్టర్లు, ఫ్లెక్సీలతో ఖమ్మం నిండిపోయింది. అమిత్ షా సభ గంటల పాటు జరగనుంది. అంటే మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకూ ఉండనుంది. ఇప్పటికే ఈ సభకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.