
- వక్ఫ్ పేరిట ఆస్తుల దుర్వినియోగం జరగనివ్వం: అమిత్ షా
న్యూఢిల్లీ: లోక్‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లు- జరిగిన చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక కామెంట్స్ చేశారు. వక్ఫ్ ఆస్తులు, వాటి వల్ల వచ్చే ఆదాయం పేద ముస్లింల సంక్షేమం కోసం ఉపయోగపడాలేగాని.. కొందరు దోచుకోవడానికి కాదన్నారు. వక్ఫ్‌లో అక్రమాలు కొనసాగాలని ప్రతిపక్ష నేతలు కోరుకుంటున్నారని తెలిపారు. అది ఎప్పటికీ జరగనివ్వబోమని ముస్లిం సమాజానికి హామీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు పేరిట ఆస్తుల దుర్వినియోగం జరగనివ్వమని చెప్పారు. వక్ఫ్ ఆస్తులను పేద ముస్లింల విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, ఆదాయ ఉత్పత్తికి ఉపయోగిస్తామని వెల్లడించారు. వక్ఫ్ (సవరణ) బిల్లుతో మసీదుల నిర్వహణపై ఎలాంటి ప్రభావం పడదని.. మత విశ్వాసాల్లో ఈ బిల్లు జోక్యం చేసుకోదన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు వక్ఫ్ నియమాలను మార్చారని..ఈ పరిస్థితికి అప్పటి యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
సొంత ఆస్తిని దానం చేయండి..ఇతరులది కాదు
దానం అనేది ఎవరైనా తన సొంత ఆస్తిలో నుంచి మాత్రమే చేయాలని.. ప్రభుత్వ ఆస్తిని లేదా ఇతరుల ఆస్తిని దానం చేయడం కరెక్ట్ కాదని అమిత్ షా స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, వాటిని పారదర్శకంగా నిర్వహించడానికి వక్ఫ్ (సవరణ) బిల్లును తీసుకువచ్చినట్లు వెల్లడించారు. "వక్ఫ్ బోర్డు 1995లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి వక్ఫ్ బోర్డు పేరిట ఆస్తుల దుర్వినియోగం జరుగుతోంది.
ఈ బిల్లు ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను కేంద్రీకరించి, పారదర్శకతను తీసుకురావాలని మేం భావిస్తున్నాం. కొందరు ప్రతిపక్ష నాయకులు ఈ బిల్లును "ముస్లిం వ్యతిరేక" చర్యగా ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ బిల్లు అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన సంస్కరణ. ఇది మతపరమైన అంశం కాదు. దేశ ఆస్తులను కాపాడే బాధ్యత మాపై ఉంది" అని అమిత్ షా వెల్లడించారు.
2 గ్రామాల నుంచి 39 లక్షల ఎకరాలకు..
భారత్‌లో వక్ఫ్ బోర్డు చరిత్ర 12వ శతాబ్దం చివరలో 2 గ్రామాల దానంతో ప్రారంభమై నేడు 39 లక్షల ఎకరాలకు చేరిందని అమిత్ షా అన్నారు. ‘1913 నుంచి 2013 వరకూ వక్ఫ్‌బోర్డుల అధీనంలోకి 18 లక్షల ఎకరాలు వెళ్లగా.. గత 12 ఏండ్లలోనే 21 లక్షల ఎకరాల భూములు పెరిగాయి. 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు వక్ఫ్‌యాక్ట్, 1995కు సవరణ చేసిన తర్వాత వక్ఫ్ భూములు అనూహ్యంగా పెరిగాయి’ అని చెప్పారు. కాగా, ప్రభుత్వం గతంలో వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో వక్ఫ్ బోర్డులకు 8.72 లక్షల ప్రాపర్టీలు ఉన్నాయని చెప్తున్నారు.