న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ కోసం కేంద్ర సర్కారు ఇంటర్పోల్తరహాలో సరికొత్త వ్యవస్థను ఆవిష్కరించింది. ‘భారత్ పోల్’ పేరుతో తీసుకొచ్చిన ఈ పోర్టల్‌ను ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ కేసుల విషయంలో నూతన శకం ప్రారంభమైందని వెల్లడించారు. భారత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఇంటర్‌పోల్‌తో మరింత సమర్థవంతంగా సహకరించుకోవడానికి, నేరాలను అదుపు చేయడంలో తమ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పోర్టల్ మార్గం సుగమం చేస్తుందని చెప్పారు.
గతంలో ఇంటర్‌పోల్‌తో కలిసి పనిచేసే ఏకైక ఏజెన్సీగా సీబీఐ మాత్రమే ఉండేదని, ఇప్పుడు భారత్ పోర్టల్‌తో భారతీయ చట్టాలను అమలుచేసే ఏజెన్సీలు, రాష్ట్ర పోలీసు బలగాలు నేరుగా కనెక్ట్‌అయ్యే వీలు కలుగుతుందని చెప్పారు. ఇంటర్‌పోల్‌తో భారత్‌పోల్ కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడమే కాకుండా.. వివిధ ప్రపంచ నేర ధోరణులను అధ్యయనం చేయడానికి, విశ్లేషించడానికి భారతీయ ఏజెన్సీలకు సాధనాలను కూడా అందిస్తుందని తెలిపారు. క్రిమినల్ డేటా మార్పిడిని మెరుగుపరుస్తుందని, దీంతో దేశం లోపల, వెలుపల నేరస్థులను పట్టుకోవడం ఈజీ అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా, 35 మంది సీబీఐ అధికారులు, ఉన్నతాధికారులను ప్రతిష్టాత్మకమైన అవార్డులతో అమిత్‌షా సత్కరించారు.
అంతర్జాతీయ సహకారం పొందడం ఈజీ..
ఇండియన్ ఇన్వెస్టిగేషన్ఏజెన్సీలు వేగవంతంగా అంతర్జాతీయ పోలీసుల సహకారం తీసుకునేందుకు సీబీఐ సహకారంతో భారత్‌పోల్‌ను అభివృద్ధి చేశారు. దర్యాప్తు సంస్థలు సరికొత్త సాంకేతిక పద్ధతులను వినియోగించుకొని పరారీలో ఉన్న నేరగాళ్లను అదుపులోకి తీసుకునేందుకు ఇది ఉపకరిస్తుంది. నేరస్థులను పట్టుకోవడమే కాకుండా.. వారి కేసుల విచారణను పూర్తిచేసి, నేరాలను నిర్మూలించడమే దీని లక్ష్యం.