జమ్మూకాశ్మీర్​లో టెర్రరిజాన్ని పాతాళంలో పాతేస్తం : అమిత్ షా

జమ్మూకాశ్మీర్​లో టెర్రరిజాన్ని పాతాళంలో పాతేస్తం : అమిత్ షా
  • దాన్ని పునరుద్ధరించే ధైర్యం ఎవరూ చేయలేరు 
  • కాంగ్రెస్​, ఎన్సీ ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేయలేవని కామెంట్​

కిష్టావర్​, గులాబ్‌‌ఘర్: జమ్మూ కాశ్మీర్‌‌లోని టెర్రరిజాన్ని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పాతాళంలోకి పాతిపెడుతుందని.. దాన్ని ఎవరూ కూడా మళ్లీ పునరుద్ధరించలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన కిష్టావర్ జిల్లాలోని పద్దర్-నాగ్సేని లోని నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు.

 ‘‘1990లో టెర్రరిజం పెచ్చరిల్లిన తర్వాత ఈ ప్రాంతం ఎంతో నష్టపోయింది. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఈ రోజు నేను హామీ ఇస్తున్నా.. టెర్రరిజాన్ని పాతాళంలో పూడ్చిపెడ్తం. అది ఎప్పటికీ బయటకు రాదు” అని అన్నారు. ఇది మోదీ ప్రభుత్వమని.. ఆయన పాలనలో భారత గడ్డపై టెర్రరిజాన్ని వ్యాప్తి చేసే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేశారని, అది ఇప్పుడు చరిత్ర పుస్తకాల్లో భాగమైందని చెప్పారు. భారత రాజ్యాంగంలో ఇకపై దానికి స్థానం లేదని తెలిపారు.

కాంగ్రెస్, ఎన్సీ కూటమి.. బీజేపీ మధ్యే పోటీ

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి.. బీజేపీ మధ్యనే పోటీ జరుగుతున్నదని అమిత్ షా అన్నారు. ఆ రెండు పార్టీలు ఆర్టికల్ 370 ని తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాయి...  బీజేపీ దానిని ఆడ్డుకోవడానికి కట్టుబడి ఉందన్నారు. తమ పార్టీ ప్రేమ్ నాథ్ డోగ్రా సిద్ధాంతాన్ని అనుసరిస్తుందన్నారు. ‘‘ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒక ప్రధానమంత్రి. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విడదీయరాని భాగం. ఎవరూ కూడా దానిని మార్చలేరు”అని తెలిపారు. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొస్తే కొండ ప్రాంతాల ప్రజలు, గుజ్జర్లకు ఇప్పుడున్న రిజర్వేషన్లు పోతాయని పేర్కొన్నారు.

 కాంగ్రెస్, ఎన్సీ కూటమి అధికారంలోకి వస్తే.. “మళ్లీ కాల్పులు మొదలవుతాయి. రాళ్లదాడులు ప్రారంభమవుతాయి. ఉగ్రవాదులకు ఘనంగా అంతిమయాత్రలు మళ్లీ నిర్వహిస్తారు. తాజియా ఊరేగింపును మళ్లీ నిషేధిస్తారు. సినిమా హాళ్లు మూసివేస్తారు. అమర్‌‌నాథ్ యాత్రపై మళ్లీ దాడులు జరుగుతాయి. జమ్మూ కాశ్మీర్‌‌కు పెట్టుబడులు ఆగిపోతాయి.. నిరుద్యోగం పెరిగిపోతుంది” అని అన్నారు.