
హల్ద్వాన్: క్రీడా రంగంలో ఇండియాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని కేంద్ర హోమంత్రి అమిత్ షా అన్నారు. ఆతిథ్య హక్కులు లభిస్తే 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు దేశం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇండియాలో ఒలింపిక్స్ జరిగినప్పుడు మన అథ్లెట్లు ఎన్నో పతకాలు నెగ్గి దేశ జెండాను ఎగురవేస్తారని శుక్రవారం జరిగిన 38వ నేషనల్ గేమ్స్ ముగింపు వేడుకల్లో అమిత్ షా పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్ ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా గేమ్స్ ముగిసినట్టు ప్రకటించిన ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష 2027లో జరిగే తదుపరి ఎడిషన్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు ఐఓఏ జెండాను అందజేశారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నేషనల్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించిందని, ఆయా ఆటల్లో రాష్ట్ర అథ్లెట్ల పెర్ఫామెన్స్‌తో దేవ భూమి ఇప్పుడు క్రీడా భూమిగా మారిందని అభిప్రాయపడ్డారు. నేషనల్ గేమ్స్‌లో టాప్–3లో నిలిచిన సర్వీసెస్, మహారాష్ట్ర, హర్యానా జట్లకు ట్రోఫీలు అందించారు.