- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. గ్యారంటీ లేని చైనా మాల్
- కాళేశ్వరం జాతీయ హోదా కోసం కేసీఆర్ ఏనాడూ మోదీని కలువలే
- ములుగు, మక్తల్, రాయగిరి సభల్లో కేంద్ర హోంమంత్రి కామెంట్స్
యాదాద్రి, ములుగు/మహబూబ్‌నగర్/మక్తల్, వెలుగు: భూదాన్ పోచంపల్లి నుంచి ఆచార్య వినోభాబావే భూదానోద్యమం చేపడితే, యాదాద్రి నుంచి కేసీఆర్, ఆయన మాఫియా భూ కబ్జా ఉద్యమం చేపట్టారని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. వేల కోట్ల విలువైన భూములను ఆయన ఎమ్మెల్యేలు కబ్జా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్యారంటీ లేని చైనా మాల్లాంటి వాళ్లన్ని, ఎప్పుడైనా పార్టీలు మారొచ్చని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే.. బీఆర్ఎస్కు వేసినట్లేనని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్లోకి వెళ్లిపోతారని ఆరోపించారు. ఆదివారం ఆయన ములుగు జిల్లాలో, నారాయణపేట జిల్లా మక్తల్‌లో, యాదాద్రి జిల్లా రాయగిరిలో నిర్వహించిన సభల్లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్కుదిరిందని, కాంగ్రెస్ వాళ్లు తెలంగాణలో కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలని చూస్తున్నారని, కేసీఆర్కేంద్రంలో రాహుల్‌ను పీఎం చేయాలనే నిర్ణయంతో ఉన్నారని అన్నారు.
బీజేపీకి ఓటు వేస్తేనే కేసీఆర్ఇంటికి పోతారని తెలిపారు. నారాయణపేట జిల్లాతో పాటు మక్తల్ నియోజకవర్గంలో వేల మంది చేనేత కార్మికులున్నారని, బీజేపీ అధికారంలోకి వచ్చాక నారాయణపేటలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. కేసీఆర్, ఆయన కొడుకు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడ్డారని, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యే భూ కబ్జాలు, మట్టి, ఇసుక దందాల్లో గుర్తింపు పొందారని అమిత్‌షా విమర్శించారు. అవినీతి పాలనను అంతమొందించాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి, మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి జలంధర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
గిరిజనేతరులకు పోడు పట్టాలిస్తం
‘‘బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ములుగులో ఏర్పాటు చేసే గిరిజన యూనివర్సిటీ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ పార్టీ ఇన్నాళ్లు స్థలం కేటాయించకుండా ఇబ్బంది పెట్టింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ గిరిజన వ్యతిరేఖ పార్టీలు. ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నది కేవలం బీజేపీ మాత్రమే’’నని అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ సర్కారు ఎంత వ్యతిరేకంగా ఉన్నా ప్రధాని మోదీ సమ్మక్క, సారలమ్మల పేరుతో ట్రైబల్యూనివర్సిటీ ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గిరిజన వ్యతిరేక పార్టీలని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిందన్నారు. కాంగ్రెస్హయాంలో గిరిజనులకు రూ.24 వేల కోట్ల బడ్జెట్‌ఉంటే.. మోదీ సర్కారు రూ.1.25 లక్షల కోట్లకు పెంచిందని గుర్తు చేశారు. 7,480 ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు చేయడంతోపాటు 50 లక్షల గిరిజన కుటుంబాలకు ఇండ్లు కట్టించామన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పోడు పట్టాల విషయంలో ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ మధ్య గొడవలు పెడుతోందని, బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులైన గిరిజనులకు, గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇస్తామన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించి ఉత్సవాలు జరుపుతామన్నారు. జాతీయ ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుచేస్తామన్నారు. ములుగు జిల్లాలో పేపర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నవంబర్ 30న కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి ములుగు నుంచి అజ్మీర ప్రహ్లాద్ ను అసెంబ్లీకి పంపాలని కోరారు.
బీఆర్ఎస్కు వీఆర్ఎస్ టైమొచ్చింది
కేసీఆర్ అవినీతి కారు గ్యారేజీ, ఆయన జైలుకు వెళ్లాల్సిన టైం వచ్చిందని అమిత్‌షా అన్నారు. “భూదాన్ పోచంపల్లి నుంచి ఆచార్య వినోభాబావే భూదానోద్యమం చేపడితే.. సీఎం కేసీఆర్ మాఫియా యాదాద్రి నుంచే భూ కబ్జా ఉద్యమం చేపట్టింది. వేల కోట్ల విలువైన భూములను ఆయన ఎమ్మెల్యేలు కబ్జా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్కు వీఆర్ఎస్ఇచ్చే సమయం వచ్చింది”అని అన్నారు. బీజేపీ పవర్లోకి రాగానే.. భూ కబ్జాలపై విచారణ చేయిస్తామన్నారు. కాళేశ్వరం జాతీయ హోదాపై కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారని, హోదా విషయంలో ఏనాడు మోదీని కేసీఆర్కలవలేదని స్పష్టం చేశారు. బీజేపీ భువనగిరి, ఆలేరు అభ్యర్థులు గూడూరు నారాయణ రెడ్డి, శ్రీనివాస్‌ను గెలిపించాలని అమిత్‌షా కోరారు.