వివరాలు పంపండి వీసాలు రద్దు చేస్తం: రాష్ట్రాలకు అమిత్ షా ఆర్డర్

వివరాలు పంపండి వీసాలు రద్దు చేస్తం: రాష్ట్రాలకు అమిత్ షా ఆర్డర్

న్యూఢిల్లీ: దేశంలోని పాక్​ పౌరులను గుర్తించి, వారిని వెనక్కి పంపే ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా శుక్రవారం ఫోన్‎లో మాట్లాడారు. మొదట స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి, ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. 

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జరిగిన సీసీఎస్ సమావేశంలో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా భారత్‌‌లో ఉన్న పాక్​పౌరుల వీసాలు రద్దు చేయాలని నిర్ణయించారు. పాక్​ పౌరులు ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా, మెడికల్‌‌ వీసాలు పొందిన వారికి మాత్రం ఈ నెల 29వ తేదీ వరకు ఉండేందుకు అవకాశం కల్పించింది. 

పాకిస్తాన్​ నుంచి కొత్త వీసా అప్లికేషన్లను వెంటనే నిలిపేసినట్టు విదేశాంగ శాఖ పేర్కొన్నది. దీంతోపాటు పాక్‌‌లో ఉన్న ఇండియన్స్​ను తిరిగి వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేసింది. ఇక్కడ పాక్‌‌ పౌరులు గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్లిపోవాలని వార్నింగ్​ ఇచ్చింది. పహల్గాం ఉగ్ర దాడి ప్రణాళిక, అమలులో పాకిస్తాన్ పాత్ర ఉందని  చెప్పేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఇండియా వెల్లడించింది. గురువారం ఈ ఆధారాలను అమెరికా, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనా దేశాలకు చెందిన సీనియర్ విదేశీ దౌత్యవేత్తలకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ  చూపించారు. అందుకే పాకిస్తాన్​పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.