పాక్‎తో చర్చల ప్రసక్తే లేదు.. జమ్మూ వేదికగా తేల్చిచెప్పిన అమిత్ షా

పాక్‎తో చర్చల ప్రసక్తే లేదు.. జమ్మూ వేదికగా తేల్చిచెప్పిన అమిత్ షా

జమ్మూ కాశ్మీర్: దాయాది దేశం పాకిస్థాన్‎పై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారాన్ని అమిత్ షా హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 22) నౌషేరాలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. పొరుగు దేశం పాకిస్థాన్ ఇంకా తన బుద్ధి మార్చుకోలేదని.. భారత్ పై విషం చిమ్మేందుకు ఇంకా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఉగ్రవాదాన్ని ఆపే వరకు పాకిస్థాన్‎తో భారత్ చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా అమిత్ షా తేల్చి చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఎన్డీఏ సర్కార్ తీసుకున్న నిర్ణయం కాశ్మీర్ ప్రజలకు వరంలా మారిందని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‎లో టెర్రరిస్టుల దాడులు,  ఉగ్రవాద కార్యకాలపాలు  తగ్గి.. జమ్మూ టూరిస్ట్ హాబ్‎గా మారుతోందని అన్నారు. గడిచిని ఏడాదిలో కోటి మంది పర్యాటకులు కశ్మీర్ ను సందర్శించారని.. జమ్మూ టూరిస్ట్ స్పాట్ గా మారుతోందనడానికి ఇదే నిదర్శమని వ్యాఖ్యానించారు. 

జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం కాకుండా కేవలం అధికారం కోసమే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు జట్టు కట్టాయని.. ఈ పార్టీలు అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ మళ్లీ ఉగ్రవాదుల అడ్డాగా మారుతోందన్నారు. జమ్మూ కాశ్మీర్‎లో అభివృద్ధి జరగాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమని.. ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా అమిత్ షా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఆర్టికల్ 3370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ముగిసింది. ఈ నెల 25న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.