ఆర్టికల్ 370 ఇక ముగిసిన అధ్యాయం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

ఆర్టికల్  370  ఇక ముగిసిన అధ్యాయం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

జమ్మూ: ఆర్టికల్ 370 ఒక చరిత్ర అని.. దాన్ని ఎవరూ కూడా పునరుద్ధరించలేరని కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా అన్నారు. దాని రద్దు కాశ్మీర్‏లో అభివృద్ధి, భద్రత, సామాజిక న్యాయానికి బాటలు వేసిందన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీ ఎజెండాకు కాంగ్రెస్ రహస్యంగా మద్దతు ఇస్తున్నదని ఆరోపించారు. ఆర్టికల్ 370 కాశ్మీర్ యువత చేతికి ఆయుధాలు, రాళ్లు ఇచ్చిందన్నారు. వారిని టెర్రరిజం వైపు వెళ్లేలా చేసిందన్నారు. 

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం జమ్మూలో అమిత్ షా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. జమ్మూ కాశ్మీర్‌‪లో మూడు దశల్లో.. సెప్టెంబర్ 18, 25వ తేదీలు, అక్టోబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం ఇక్కడికి వచ్చిన అమిత్​ షా పార్టీ మేనిఫెస్టో  ‘‘సంకల్ప్‌‌‌‌‌‌‌‌ పత్ర’’ ను విడుదల చేశారు. 

టెర్రరిజం, వేర్పాటువాదం తుడిచిపెడ్తం

బీజేపీ తన మేనిఫెస్టో సంపకల్ప పత్రలో 25 హామీలు ఇచ్చింది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్‪లో టెర్రరిజం, వేర్పాటువాదాన్ని తుడిచిపెడ్తామని చెప్పింది. అలాగే ప్రతి ఇంట్లో వయస్సులో పెద్దదైన మహిళకు ఏటా రూ.18 వేలు ఇచ్చేందుకు ‘మా సమ్మాన్ యోజన’ అమలు చేస్తామంది. ఉజ్వల పథకం కింద ప్రతి కుటుంబానికి ఏటా రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తామంది.

 ప్రగతి శిక్షా యోజన కింద కాలేజీ స్టూడెంట్లకు ట్రాన్స్​పోర్ట్ అలవెన్స్ కింద ఏటా రూ.3 వేలు, అలాగే రాష్ట్రంలో వెయ్యి ఎంబీబీఎస్​ సీట్లు పెంచుతామంది. పండిట్ ప్రేమ్ నాథ్ డోగ్రా రోజ్‌‌‌‌‌‌‌‌గార్ యోజన కింద 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కాగా, ఎన్నికల ప్రచారంలో పాల్గొనే 40 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్​ను బీజేపీ తాజాగా విడుదల చేసింది.