వక్ఫ్ బిల్లు ముస్లీంలకు మేలు చేసేదే తప్ప కీడు చేసేది కాదు: అమిత్ షా

వక్ఫ్ బిల్లు  ముస్లీంలకు మేలు చేసేదే తప్ప కీడు చేసేది కాదు: అమిత్ షా

న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లు ముస్లింలకు మేలు చేసేదే తప్ప.. కీడు చేసేది కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై లోక్ సభలో వాడీ వేడీగా చర్చ జరిగింది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలకు ధీటుగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం (ఏప్రిల్ 2) వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ బిల్లు అంశంపై రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు. 

వక్ఫ్ బిల్లుకు మెజార్టీ వర్గాల మద్దతు ఉంది. కానీ కొన్ని పార్టీలు మెనార్టీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లు అతిపెద్ద సంస్కరణగా అభివర్ణించారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమేనని.. కావాలనే వక్ఫ్ బిల్లుపై మెనార్టీల్లో అపోహలు సృష్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. అనేక రాష్ట్రాల్లో వక్ఫ్ భూములపై కేసులు ఉన్నాయని.. తెలంగాణ, హరియాణా, యూపీ వంటి రాష్ట్రాల్లో కేసులు నడుస్తున్నాయని తెలిపారు.

 వక్ఫ్ ఆస్తులను ప్రార్థన, ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తే ఎలాంటి ఇబ్బంది లేదని.. ఆ భూములను అక్రమాలకు ఉపయోగిస్తేనే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులను అడ్డుపెట్టుకుని కొందరు వందల కోట్లు సంపాదిస్తున్నారని.. వక్ఫ్ ఉన్నది పేద ముస్లింల కోసం.. దొంగల కోసం కాదని హాట్ కామెంట్స్ చేశారు. వక్ఫ్‎లో ముస్లిమేతరులకు చోటు లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు అమిత్ షా. 

Also Read:-వక్ఫ్ బిల్లుసవరణలు ఆమోదం పొందితే..5 కీలక మార్పులు

అలాగే.. వక్ఫ్ ఆస్తుల సక్రమ వినియోగానికి ఈ బిల్లు తోడ్పడుతోంది.. వక్ఫ్‎లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తులను దోపిడీ చేస్తున్న వారిని పట్టుకోవడమే వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల లక్ష్యమని పేర్కొన్నారు.2013లో కాంగ్రెస్ వక్ఫ్ బోర్డుకు అపరిమిత అధికారాలు కట్టబెట్టారని విమర్శించారు. దేశంలోని ఎన్నో దేవాలయాల భూములు, రైల్వే భూములను కూడా కాంగ్రెస్ వక్ఫ్‎కు కట్టబెట్టిందని ఆరోపించారు.